టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వకూడదని ప్రతిజ్ఞ చేస్తున్న గ్రామస్తులు
కమ్మర్‌పల్లి(బాల్కొండ): నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం జరగ నున్న సీఎం కేసీఆర్ ఆశీర్వాద సభకు వెళ్లవద్దని కమ్మర్‌పల్లి మండలం హాసాకొత్తూర్ గ్రామస్తులు తీర్మానం చేశారు. మంగళవారం గ్రామ శివారులోని జగదాంబ క్షేత్రంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు సమావేశమై ఈ మేరకు తీర్మానం చేశారు. తమ గ్రామానికి అధికారికంగా మంజూరైన చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం గేట్‌వాల్వ్ బిగించడంలో పాలకులు, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఎత్తిపోతల పథకం ద్వారా నీరు విడుదల చేస్తున్నప్పటికీ, చౌట్‌పల్లి గ్రామంతో వివాదం కారణంగా తమ గ్రామ చెరువులోకి నీరు రావడం లేదని వాపోయారు. దీంతో సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామన్నారు.
అధికారికంగా మంజూరైన గేట్‌వాల్వ్‌ను ఏర్పాటు చేయకపోవడంతో రెండు గ్రామాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులమంతా ఏకమై అధికార పార్టీకి మద్దతు ఇవ్వకూడదని, ప్రజాప్రతినిధులు గ్రామానికి వస్తే వారికి కూడా మద్దతుగా నిలవకూడదని నిర్ణయించుకున్నామన్నారు. బుధవారం జరిగే సీఎం సభకు గ్రామంలో ఎవరు కూడా వెళ్లకూడదని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల నాటికి గేట్ వాల్వ్ బిగించకపోతే ఎన్నికలను సైతం బహిష్కరిస్తామని హెచ్చరించారు. రాస్తారోకో సందర్భంగా గ్రామస్తులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని తీర్మానించారు. అనంతరం గ్రామస్తులంతా అధికార పార్టీకి మద్దతు తెలపకూడదని, సీఎం సభకు వెళ్లకూడదని ప్రతిజ్ఞ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment