ఆసరాకు ‘లైవ్ ఎవిడెన్స్’ అక్కరలేదు! | don't have live evidence to asara! | Sakshi
Sakshi News home page

ఆసరాకు ‘లైవ్ ఎవిడెన్స్’ అక్కరలేదు!

Published Tue, Sep 27 2016 3:35 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM

ఆసరాకు ‘లైవ్ ఎవిడెన్స్’ అక్కరలేదు!

ఆసరాకు ‘లైవ్ ఎవిడెన్స్’ అక్కరలేదు!

సాక్షి, హైదరాబాద్: ఆసరా పింఛన్ లబ్ధిదారులకు లైవ్ ఎవిడెన్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆసరా లబ్ధిదారులు లైవ్ ఎవిడెన్స్ ఇచ్చేందుకు అవసరమైన సాంకేతిక వసతులు లేకపోవడం, వృద్ధులు, వికలాంగులకు ఇదొక యాతనగా మారిన నేపథ్యంలో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 36 లక్షలమంది ఆసరా పెన్షన ర్లు ఉండగా, ఇందులో బ్యాంకు ఖాతాల ద్వారా 11,12,790 మంది పింఛన్ సొమ్మును అందుకుంటున్నారు. బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్ సొమ్ము పంపిణీలో పారదర్శకత కోసమని ప్రభుత్వం గత జూన్‌లో లైవ్ ఎవిడెన్స్ ప్రక్రియను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ తరహా పెన్షనర్లు ప్రతి ఆర్నెల్లకు ఒకమారు సమీప మీసేవాకేంద్రం నుంచి ఆధార్ ఆధారిత వేలిముద్ర (బయోమెట్రిక్) ద్వారా లైవ్ ఎవిడెన్స్‌ను సమర్పించాల్సి ఉంది. లైవ్ ఎవిడెన్స్ ఇవ్వడం మరిచిపోయినట్లైతే సదరు లబ్ధిదారులకు అందాల్సిన పింఛన్‌ను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) నిలిపివేస్తోంది. ఫలితంగా అర్హులైన లబ్ధిదారులు సైతం పింఛన్ సొమ్మును నష్టపోవాల్సి వస్తోంది. ఈ విషయమై క్షేత్రస్థాయి నుంచి వేలాదిగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఆసరా పథకంలో లైవ్ ఎవిడెన్స్ ప్రక్రియను నిలిపివేయాలని భావిస్తోంది.

మరోవైపు లైవ్ ఎవిడెన్స్ నిబంధన కారణంగా దాదాపు 40 వేల అక్రమ పెన్షన్లను నిలువరించగలిగామని అధికారులు పేర్కొనడంతో.. ప్రస్తుతానికి గ్రామీణ లబ్ధిదారులకు మాత్రం మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. లబ్ధిదారులు జీవించి ఉన్నారా.. లేదా అన్న సమాచారాన్ని పంచాయతీ కార్యదర్శుల ద్వారా సేకరించాలని సూచించినట్లు తెలిసింది.
 
హైదరాబాద్‌లో ఆసరా బాధ్యతలు జీహెచ్‌ఎంసీకే!
హైదరాబాద్ జిల్లా పరిధిలో ‘ఆసరా’ అమలు బాధ్యతలను సంపూర్ణంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)కు అప్పగించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) భావిస్తోంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాల్లో ఆసరా పథకం అమలును జీహెచ్‌ఎంసీ అధికారులు పర్యవేక్షిస్త్తుండగా, హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం చూసుకుంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగా హైదరాబాద్ అర్బన్ ప్రాంతాలకు మండల పరిషత్ అభివృద్ధి(ఎంపీడీవో) వ్యవస్థ లేకపోవడంతో ఆసరా పింఛన్‌ల పథకం అమలును హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ, ఇతర అర్బన్  ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
 
సిబ్బంది కొరతతో సమస్య..
హైదరాబాద్ జిల్లాలో రెవెన్యూ విభాగానికి తగినంత మంది సిబ్బంది లేకపోవడం, ఉన్న కొద్దిపాటి సిబ్బంది భూములు సంబంధిత వ్యవహారాలతో తలమునకలవుతుండడంతో ఆసరా అమలులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రత్యేకించి క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు సమాచారం అందజేయడం, పింఛన్ దరఖాస్తుల పరిశీలన, పంపిణీ కార్యక్రమాలకు తగినంత సమయం కేటాయించేందుకు రెవెన్యూ సిబ్బంది విముఖత వ్యక్తం చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని అర్బన్ ప్రాంతంలో మాదిరిగానే హైదరాబాద్ జిల్లాలోనూ స్థానికంగా ఉండే డిప్యూటీ కమిషనర్లకే ఆసరా పథకం అమలు బాధ్యతలను అప్పగించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ భావిస్తోంది. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులతో సంప్రదించాలని ఇటీవల జరిగిన సమావేశంలో సెర్ప్ అధికారులు నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ నుంచి ఆమోదం లభిస్తే.. వచ్చే నవంబర్ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చే యనున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement