ఖమ్మానికి ఇప్పట్లో పోలీస్ కమిషనరేట్ లేనట్టే..!
ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన
స్టేషన్‌ల ఆధునికీకరణ వైపే మొగ్గు
అనవసర వ్యయానికి నిరాసక్తత
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : జిల్లా కేంద్రంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఖమ్మంలో పోలీస్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. జిల్లా బాస్‌లా డీఐజీ స్థాయి అధికారిని నియమించడంతో పాటు పోలీస్‌శాఖకు ఆధునిక హంగులు సమకూర్చడం కోసం ప్రభుత్వం ప్రాథమికంగా కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మం లాంటి ప్రాంతానికి ఇప్పటికిప్పుడు కమిషనరేట్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత లేదని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలోని పోలీస్‌స్టేషన్‌లను బలోపేతం చేయటం, ఆధునికీకరించడంపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
మావోల నిరోధానికే పరిమితం..
ఖమ్మం పోలీస్ కమిషనరేట్ విషయంలో ముందు అనుకున్నంత వేగంగా పైళ్లు కదలకపోవడం, కమిషనరేట్ ఏర్పాటుకు దాదాపు రూ.300 కోట్లు వెచ్చించాల్సి రావడంతోనే ప్రభుత్వ ఉన్నతాధికారులు యథాస్థితిని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి ఇతర అంశాల జోలికి వెళ్లకుండా మావోయిస్టు కార్యకలాపాల నియంత్రణ, శాంతిభద్రతల పర్యవేక్షణపై దృష్టి సారిస్తే చాలనే యోచనలో ఉన్నట్టు తె లుస్తోంది.
అనవసర వ్యయం ఎందుకని..
తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రధాన జిల్లాల మాదిరిగా ఖమ్మం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ ఖమ్మం కేంద్రంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయడానికి తగిన జనాభా లేదని అధికారులు భావించినట్టు సమాచారం. జిల్లా సరిహద్దు అయిన పాలేరు, ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గాలతో పాటు సత్తుపల్లి నియోజకవర్గంలోని కొంతభాగాన్ని కలుపుకొని కమిషనరేట్ ఏర్పాటు చేయాలని జిల్లా పోలీస్ అధికారి రంగనాథ్ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు అయితే అనవసర వ్యయప్రయాసలకు ఓర్చాల్సి వస్తుందని ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది.
ఒకవేళ కమిషనరేట్ ఏర్పాటు అయితే డీఐజీ స్థాయి అధికారిని నియమించాలి. ప్రతి స్టేషన్‌కు ఓ సర్కిల్ ఇన్స్‌స్పెక్టర్ స్థాయి అధికారిని స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఏర్పాటు చేయాలి. కమిషనరేట్ పరిధిలో మహిళా పోలీస్‌స్టేషన్, క్రైమ్‌స్టేషన్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలి. ప్రతి విభాగానికి డీఎస్పీ స్థాయి అధికారిని ఏసీపీగా నియమించాలి. ఇదంతా వ్యయప్రయాసలతో కూడుకున్న అంశం కాబట్టి ప్రభుత్వం వెనుకడుగు వేసినట్టు తెలుస్తోంది. పైగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేయటం ద్వారా ఖమ్మానికి ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం కూడా ఏమిలేదని ప్రభుత్వ భావన. అందుకే కమిషనరేట్ ఏర్పాటు యోచనను విరమించుకున్నట్టు సమాచారం.
అధికార పార్టీ నేతల్లోనూ నిరాసక్తి
కమిషనరేట్ ఏర్పాటుపై అధికార పార్టీ నేతల్లోనూ పెద్దగా ఆసక్తి లేదు. ఈ అంశంపై వారు ప్రభుత్వంపై ఏమాత్రం ఒత్తిడి తెచ్చేందుకు సుముఖంగా లేరు. ఇటువంటి సమయంలో ఖమ్మంపై బలవంతంగా కమిషనరేట్‌ను రుద్దడం ఎందుకన్న అభిప్రాయంలో పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.