వట్టిపోతున్న కృష్ణమ్మ
పరీవాహక ప్రాంతాల్లో ఎండుతున్న పంటలు
- నదిపై ఆధారపడి 40 వేల ఎకరాల్లో సాగు
- ఇప్పటికే 2 వేల ఎకరాల్లో ఎండిన పంట
- కర్ణాటకలో అడ్డుకట్టలు వేయడం వల్లే..
మాగనూర్: కృష్ణానది వట్టిపోతోంది. నదిలోకి ఎగువనుంచి దిగువకు చుక్కనీరు రావడం లేదు. దీంతో మహబూబ్‌నగర్, వనపర్తి జిల్లాల పరిధిలోని పరీవాహక ప్రాంతాల్లో సాగుచేసిన పంటలకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. మరో తడికి నీళ్లు అందితే పంట చేతికి వచ్చే పరిస్థితి ఉండగా, నీరు లేక పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఇప్పటికే 2వేల ఎకరాలు ఎండిపోగా.. మిగతావి ఎండుముఖం పడుతున్నాయి.
కృష్ణానది రాష్ట్రంలో అడుగుపెడుతున్న మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలం తంగిడి గ్రామం నుంచి మొదలుకొని జూరాల ప్రాజెక్టు వరకు మక్తల్, ఆత్మకూర్, మాగనూర్ మండలాల్లోని మొత్తం 15 ఎత్తిపోతల పథకాల కింద 8,500 ఎకరాలు, జూరాల ప్రాజెక్టు ఎడమకాల్వకింద 12,000 ఎకరాలు ఈ రబీలో వరిసాగు అవుతుందని ఐడీసీ వారి అంచనా. దీంతోపాటు నదీతీరంలోని రైతులు సొంతంగా ఏర్పాటు చేసుకున్న పంపుల ద్వారా మరో 20వేల ఎకరాల వరకు వరి సాగవుతుందని అంచనా వేశారు. అయితే, ఈ పంటలన్నీ చివరి దశలో ఉన్నాయి. కర్ణాటక దిగువకు చుక్కనీరు కూడా వదలకుండా అడ్డుకట్టలు వేసింది. దీంతో కృష్ణాలో నీరు అడుగంటింది. ఎత్తిపోతలకు నీరందక వాటిపై ఆధారపడిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. వారంరోజులు ఇలానే పరిస్థితి ఉంటే ఒక్క గింజ కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయాన్ని అధికారులు, నేతలకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎత్తిపోతల కింద తగ్గిన సాగు..
ఖరీఫ్‌లో కృష్ణా మండలంలోని గుడెబల్లూర్ ఎత్తిపోతల పథకంలో 3 వేల ఎకరాల భూమిసాగు కావాల్సి ఉండగా కేవలం 850ఎకరాల్లో మాత్రమే వరి సాగుచేశారు. అదే రబీకి వచ్చే సరికి కేవలం తిండిగింజల కోసం 400 ఎకరాల్లో వరి సాగు చేశారు. ముడుమాల్ ఎత్తిపోతల పథకంలో 3 వేలకుపైగా ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, కేవలం 300 ఎకరాల్లో సాగు చేశారు. కళహళ్లి ఎత్తిపోతల పథకం కింద 2,500 ఎకరాలు సాగుకావాల్సి ఉండగా ప్రస్తుతం 200 ఎకరాల్లో సాగు చేశారు. ఆత్మకూర్ మండలంలోని అమరచింత ఎత్తిపోతల పథకం కింద 4వేల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా కేవలం 1,200 ఎకరాల్లో సాగవుతోంది. ఇందులో 1,090 మంది రైతులు ఉన్నారు. ఈ పథకం కింద అమరచింత, మస్తీపురం, ఖానాపురం, సింగంపేట, మూలమళ్ల పామిరెడ్డిపల్లి గ్రామాలకు సాగునీరు అందుతుంది. అయితే, సాగు చేసే సమయంలో పై నుంచి దిగువకు ఏ స్థాయిలో నీరు వస్తుంది.. ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలి. ఎప్పటివరకు నీరు వస్తుందనే విషయంపై రైతులకు స్పష్టమైన సమాచారం ఇచ్చేవారు లేకుండా పోయారు. పుంజనూరు ఎత్తిపోతల కింద వరి పంట ఎండుముఖం పట్టింది.
తాగునీటికీ తప్పని ఇబ్బందులు
కృష్ణా నదిలో నీరు లేక గ్రామాల కు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మక్తల్ మండలంలోని పస్పుల, జూరాల వద్ద ఏర్పాటు చేసిన సత్యసాయి తాగునీటి పథకంతోపాటు రామన్‌పాడు తాగునీటి పథకానికీS నీళ్లు అందక రెండురోజులకు ఒకమారు నీటి సరఫరా చేస్తున్నారు. మాగనూర్‌లో సత్యసాయి తాగునీటి సరఫరా నెల రోజులుగా నిలి
చిపోయింది.