ప్రసంగిస్తున్న విజయశాంతి
నిజామాబాద్ సిటీ/నిజామాబాద్ : దేశం, రాష్ట్రం బాగు పడాలంటే ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం కేసీఆర్‌ను తరిమికొట్టాలని టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పిలుపునిచ్చారు. మోదీ దేశ ప్రజలను ఆర్థికంగా దెబ్బ తీస్తే, కేసీఆర్ అబద్ధాలతో రాష్ట్రాన్ని ఏలుతున్నారని విమర్శించారు. గురువారం నిజామాబాద్‌లోని చంద్రశేఖర్‌కాలనీలో నిర్వహించిన బహిరంగ సభలో విజయశాంతి ప్రసంగించారు. దేశానికి మోదీ, రాష్ట్రానికి కేసీఆర్ శనిలా మారారని, వారిని తరిమి కొడితేనే మనం బాగుపడుతామన్నారు.
ఆర్థిక ఇబ్బందులే..
2014 ఎన్నికల వేళ నల్లధనం తీసుకువచ్చి ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని మోదీ మాయ మాటలు చెప్పటంతో ప్రజలు గెలిపించారని, కానీ, ఆ తర్వాతే మోదీ అసలు స్వరూపం బయటపడిందని విజయశాంతి తెలిపారు. పెద్ద నోట్లు రద్దు చేసి అనేక మంది ప్రాణాలు పోడానికి కారణమయ్యాడని విమర్శించారు. జీఎస్‌టీ తీసుకువచ్చి చిన్న వ్యాపారాలు, పరిశ్రమలను దెబ్బతీశాడన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన మోదీ.. మళ్లీ నమ్మించి గొంతు కోయడానికి వస్తున్నాడని ఆరోపించారు. ప్రస్తుతం నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీల మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి రాహుల్‌ను ప్రధాని చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ జన్మంతా అబద్ధాలే..
కేసీఆర్ మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేనని విజయశాంతి విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌ను గిన్నిస్‌బుక్ రికార్డులో ఎక్కించవచ్చని ఎద్దేవా చేశారు. ఐదేళ్లుగా కేసీఆర్ మోదీకి గులాం, సలామ్ చేస్తున్నాడన్నారు. 15 మంది ఎంపీలు ఉన్నా ఐదేళ్లలో విభజన హామీలు సాధించుకోలేదు కానీ, ఇప్పుడు 16 మంది ఎంపీలు కావాలని అనడం సిగ్గుచేటనన్నారు. కేసీఆర్‌కు ఓటువేస్తే మోదీకి వేసినట్లేనని తెలిపారు. ఎంపీ కవిత జిల్లాకు చేసింది ఏమి లేదని విమర్శించారు. సోనియాగాంధీ వల్లే తెలంగాణ వచ్చిందని, దొరల పాలన పోవాలంటే కేసీఆర్‌కు కాకుండా కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు.
నిజామాబాద్‌లో 180 మంది రైతులు నామినేషన్లు వేశారంటే ఇక్కడి రైతుల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. పసుపు, ఎర్రొజొన్న రైతుల సమస్యలకు పరిష్కారం చూపని కేసీఆర్‌పై రైతుల తిరిగిబాటు మొదలైందని, ప్రజలు సైతం ఈ విషయాన్ని గుర్తించుకుని కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రులు షబ్బీర్‌అలీ, సుదర్శన్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి మధుయాష్కీగౌడ్, డీసీసీ చీఫ్ మానాల మోహన్‌రెడ్డి, నాయకులు గడుగు గంగాధర్, కేశ వేణు, సుభాష్‌జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment