అన్నింటికీ అవతలికే.. | drought of students health care | Sakshi
Sakshi News home page

అన్నింటికీ అవతలికే..

Published Sat, Aug 16 2014 2:49 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

drought of students health care

ఆదిలాబాద్ టౌన్ : డీఈవో, ఆర్వీఎం జిల్లా కార్యాలయాలు ఉన్నటువంటి జిల్లాకేంద్రంలోని గజిటెడ్ నెంబర్ 1 ప్రభుత్వ పాఠశాలో 600లకుపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆదిలాబాద్ పట్టణంలో పురాతన పాఠశాలల్లో ఇదొక్కటి. ప్రస్తుతం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న బి.చంద్రకుమార్ కూడా ఇదే పాఠశాలో చదువుకున్నారు.

ఆయన ఆదిలాబాద్ వచ్చినప్పుడు ఈ పాఠశాలలో సదస్సులు నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఎంతో మంది ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఈ పాఠశాలలో ఇప్పటికీ విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. విద్యార్థినుల అవసరాలు తీరుతుండగా, విద్యార్థులు మాత్రం బయటకు వెళ్లాల్సి వస్తుంది. జిల్లాలోని అనేక పాఠశాలల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. కొన్ని పాఠశాలల్లో అసలుకే టాయిలెట్లు లేక విద్యార్థులతోపాటు చదువులు చెప్పే ఉపాధ్యాయులకు కూడా సమస్య తప్పడం లేదు.

 మరో 4,235 మరుగుదొడ్లు అవసరం..
 జిల్లాలో దాదాపు 4 వేల పాఠశాలల్లో 2.60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ మరుగుదొడ్లు కల్పించాల్సిన బాధ్యత రాజీవ్ విద్యామిషన్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలకు అప్పగించారు. అయితే ఏ పాఠశాలలో ఎన్ని ఉన్నాయో కూడా అధికారులు లెక్క చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. 2011-12 విద్యా సంవత్సరంలో 1,114 మంజూరు కాగా 1,054 మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసినట్లు, 60 నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

క్షేత్రస్థాయిలో మాత్రం వాటి వినియోగం అంతంత మాత్రంగానే ఉంది. 2012-13 విద్యా సంవత్సరంలో వైకల్యంగల విద్యార్థుల సౌకర్యార్థం 261 మంజూరు కాగా 24 పూర్తయ్యాయి. 105 నిర్మాణ దశలో, 132 ఇంకా ప్రారంభం కానట్లు ఆర్వీఎం అధికారులు పేర్కొంటున్నారు. అలాగే జిల్లాలో మొత్తం పాఠశాలలు కలిపి 3,534 మరుగుదొడ్లు ఉన్నాయని, మరో 4,235 మరుగుదొడ్లు అవసరం ఉన్నట్లు ఆయా మండల విద్యాధికారులు పేర్కొంటున్నారు.

 పెరుగుతున్న విద్యార్థినుల డ్రాపౌట్ల సంఖ్య..
 పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువవ్వడంతో విద్యార్థినులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక చాలా మంది విద్యార్థినులు సక్రమంగా పాఠశాలకు హాజరు కావడం లేదు. మరికొందరైతే పాఠశాలకు రావడం మానేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. పాఠశాల వేళల్లో విద్యార్థినులు మరుగుదొడ్లు వినియోగించాల్సి వస్తే ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

 కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నా అవి శిథిలావస్థకు చేరడం, మరికొన్ని నిరుపయోగంగా ఉన్నాయి. ఇంకొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల వద్ద పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. అందులో విషపురుగులు ఉంటాయనే భయాందోళనతో వాటిని వినియోగించడం లేదు. ఉన్న కొన్ని మరుగుదొడ్లలో నీటి వసతి లేక నిరుపయోగంగా మారాయి.

 నిధుల దుర్వినియోగం..
 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించిన నిధులు దుర్వినియోగం అవుతున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత అధికారులు, ఉపాధ్యాయులు వాటిని తమ సొంత పనులకు వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని పాఠశాలల్లో పాతవాటికే రంగులు పూసి నిధులు కాజేసిన దాఖలాలు ఉన్నాయి.

మరికొన్ని పాఠశాలల్లో కాంట్రాక్టర్లు నాసీరకంగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టి డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో నిర్మించిన కొన్ని నెలలకే అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ఏదేమైనా మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో విద్యార్థినులకు శాపంగా మారుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యార్థినుల డ్రాప్‌ఔట్ సంఖ్యను తగ్గించి వారి సమస్యను తీర్చాలని పలువురు కోరుతున్నారు.

 సుప్రీం ఆదేశాలు బేఖాతరు..
 దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలను విద్యాశాఖ తుంగలో తొక్కుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు తప్పనిసరిగా నిర్మించాలని సుప్రీంకోర్టు 2011 డిసెంబర్‌లో, 2012 అక్టోబర్‌లో రెండుసార్లూ ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు జారీ అయి ఆరు నెలలైనా పరిస్థితిలో మార్పు లేదు. విద్యార్థినులు పాఠశాలలకు వచ్చేందుకు అన్ని వసతులూ కల్పిస్తున్నామని చెబుతున్నా ఆచరణలో కానరావడం లేదు. ఫలితంగా విద్యార్థులకు భద్రత లేకుండాపోతోంది. మరుగుదొడ్లు లేక విద్యార్థినులతోపాటు అందులో పాఠాలు చెప్పే ఉపాధ్యాయినులకూ ఇబ్బందులు తప్పడం లేదు.

 ఆర్‌డబ్ల్యూఎస్ వారు చూస్తున్నారు.. - పెర్క యాదయ్య, ఆర్వీఎం పీవో
 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్మించాల్సిన మరుగుదొడ్ల నిర్వహణ ఆర్‌డబ్ల్యూఎస్ వారు చూస్తున్నారు. జిల్లాకు కొత్తగా 3 వేలు మరుగుదొడ్లు మంజూరైనట్లు సమాచారం. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ వివరాలు మా దగ్గర లేవు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement