వాన..హైరానా!
నాలుగు నియోజకవర్గాల్లో కుండపోత
సాక్షి, బృందం: వరుణుడు హైరానా సృష్టించాడు.. రానురానంటూనే కుండపోత వాన కురిపించాడు.. నాలుగు నియోజకవర్గాల్లో అక్కడక్కడా అన్నదాతకు నష్టమే మిగిల్చాడు. జిల్లాలో రెండు రోజులుగా భారీ వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 19.7 మి.మీగా నమోదైంది. మానవపాడు మండలంలో 135.0 మి.మీ, అయిజలో 118.6 మి.మీ అత్యధిక వర్షపాతం కురిసింది. అలాగే అలంపూర్, నారాయణపేట, కొల్లాపూర్, గద్వాల నియోజకవర్గాల్లో ఆశించినస్థాయిలో వర్షాలు కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వర్షానికి జిల్లాకేంద్రంలోని లోతట్టు కాలనీలతో పాటు మానవపాడు మండలకేంద్రంలోని పలు ఇళ్లలోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. అయిజలో కూడా రాత్రి ఏకధాటిగా వర్షం కురవడంతో వాగులు వంకలు ఏకమైపారాయి. స్థానికులు నాలుగేళ్ల క్రితం నాటి వరదలను తలుచుకొని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. భారీవర్షం కురుస్తుండడంతో తుంగభద్ర నదీతీర గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మానవపాడుకు సమీపంలోని పెద్దవాగు ఉప్పొంగడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. స్థానిక ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లోకి వర్షపు నీరు చేరడంతో విలువైన రికార్డులు తడిసిపోయాయి.
అలాగే కొల్లాపూర్ మం డలంలోని రామాపురం, పెంట్లవెల్లి- మల్లేశ్వరం, మంచాలకట్ట, నార్లాపూర్- ముకిడిగుండం గ్రామాల మధ్యవాగులు పొంగిపొరాయి. వీపనగండ్ల మం డ లం గడ్డబస్వాపూర్ గ్రామంలో కొత్తచెరువు కట్ట తె గిపోవడంతో వరిపొలాల్లో ఇసుకమేటలు వేశాయి. కాగ్నా ఉధృతంగా ప్రవహించడంతోకొడంగల్, తాం డూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొడంగల్ శివారులోని నల్లచెరువు వాగుకు వచ్చిన వరద లో చిక్కుకొని జయమ్మ (50) మరణించింది.
పంటనష్టం
శాంతినగర్ మండలంలో మాన్‌దొడ్డి, రాజోలి వాగు లు పొంగి ప్రవహించడంతో సమీపంలోని మాన్‌దొడ్డి, నసనూరు గ్రామాల్లో సుమారు 132ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. మాగనూరు మండలంలోని చెన్నిపాడు, అమరవాయి, మానవపాడు, జల్లాపురం, నారాయణపురం, పెద్ద ఆముదాలపాడు, పుల్లూరు, కలుగొట్ల, మెన్నిపాడు, మద్దూరు తదితర గ్రామాల్లో 400 ఎకరకాలకు పైగా పత్తి, మిరప, చెరుకు, జొన్న, వరి వంటి పంటలు నాశనమయ్యాయి. ఒక్కోరైతు ఎకరాకు సుమారు రూ.15వేల వరకు ఖర్చు చేశాడు.
కురవక కురిసిన వర్షానికి భారీ నష్టాన్ని చవిచూశారు. పంట నష్టం అంచనాలు వేసేందుకు వ్యవసాయశాఖ జేడీ భగవత్ స్వరూప్ ఆయా మండలాల్లో పర్యటిస్తున్నారు. ఆత్మకూరు మండలంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వకు అనుసంధానమైన డీ-6కాల్వకు గండిపడడంతో 50 ఎకరాల్లో పంట నీటమునిగింది.
కూలిన ఇళ్లు
మానవపాడు మండలంలో జల్లాపురం గ్రామంలో రెండు ఇళ్లు, ఉండవెల్లిలో నాలుగు ఇళ్లు, మానవపాడులో రెండు, ఇటిక్యాలపాడులో రెండు, బొంకూరులో రెండిళ్లు కూలిపోయాయి. కొడంగల్ మండలంలోని చిట్టపల్లి వాగు పొంగి ప్రవహించడంతో సమీపంలోని మైసమ్మతండాకు రాకపోకలు స్తంభిం చాయి. దౌల్తాబాద్, ధన్వాడ మండలాల్లో రెండిళ్లు నేలమట్టమయ్యాయి.
19.7 మి.మీ వర్షపాతం నమోదు
పాలమూరు: జిల్లాలో 45 మండలాల్లో ఆశించినస్థాయిలో వర్షం కురిసింది. వీపనగండ్లలో 79.0 మి.మీ, కొల్లాపూర్ 78.2, కొడంగల్ 67.0, వడ్డేపల్లి 58.4, గద్వాల 53.6, పాన్‌గల్ 44.6, షాద్‌నగర్ 42.6, అలంపూర్ 42.4, మల్దకల్ 40.2, ఇటిక్యాల 34.2, గ ట్టు 31.0, పెబ్బేరు 29.0, అమ్రాబాద్ 27.0, ధరూర్ 26.0, కొత్తూరు 24.2, పెద్దకొత్తపల్లి 22.0, బల్మూర్ 24.4, దౌల్తాబాద్, బొంరాస్‌పేట 20.0, నర్వ 17.4, ఆత్మకూర్ 17.0, కొందుర్గులో 16.8, కోడేరు, కేశంపేట 15.0, వనపర్తి 12.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 30 మండలాల్లో 10 మి.మీ లోపు వర్షపాతం కురిసింది.
మహబూబ్‌నగర్‌లో..
జిల్లా కేంద్రంలో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతా లు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై మోకాలిలోతు వరదనీరు చేరింది. కలెక్టరేట్, కొత్త బ స్టాండు, న్యూటౌన్, జిల్లా ఆసుపత్రి తదితర ప్రధాన రహదారులపై వర్షపు నీరుచేరుతోంది.లోతట్టు ప్రాంతాలైన అంబేద్కర్‌నగర్, వీరన్నపేట, పాత అశోక్ థియేటర్ ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది.