పల్లెగడపకు..e-సాక్షరత | e- saksarata village | Sakshi
Sakshi News home page

పల్లెగడపకు..e-సాక్షరత

Published Tue, Dec 23 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 6:35 PM

పల్లెగడపకు..e-సాక్షరత

పల్లెగడపకు..e-సాక్షరత

సూర్యాపేట రూరల్ : ఇప్పుడంతా డిజిటల్ ట్రెండ్. ఇంటర్‌నెట్‌తో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. ఈ నేపథ్యంలో అత్యాధునిక పరిజ్ఞాన ఫలాలను మరింతగా విస్తరించడంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటికొకరు చొప్పున సాంకేతిక విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పం దం కుదుర్చుకుంది. పల్లెల్లో ప్రతి ఇంటా ఈ-సాక్షరత పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలను ఎంపిక చేసింది. అందులో నల్లగొండ జిల్లా ఎంపిక కాగా దానిలో సూర్యాపేట మండలం ఉండడం విశేషం. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ప్రతి ఇంటిలోనూ ఒకరిని సాంకేతిక విద్యావంతుడిగా తీర్చిదిద్దా లన్న లక్ష్యంతో జాతీయ ఐటీ పాలసీని రూపొం దించింది. సూర్యాపేట మండలంలో 18 గ్రామాలతో పాటు 33 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. జనాభా 48,617 ఉంది. జనాభాలో  అక్షరాస్యత 63 శాతం ఉంది.
 
 శిక్షణ ఇలా..
 నేషనల్ డిజిటల్ లిటరసీ మిషన్ ఆధ్వర్యంలో చేపట్టే ఈ పథకంలో భాగంగా 14-60 సంవత్సరాల వయసున్న సాంకేతిక నిరక్షరాస్యులను గుర్తించి శిక్షణ ఇస్తారు. ఇందుకు సూర్యాపేట  మండలానికి చెందిన ఏడుగురు మీ సేవ ఆపరేటర్లను ఎంపిక చేసి వారి ద్వారా సర్వే నిర్వహించేందుకు రంగం సిద్ధం చేశారు. సూర్యాపేట మండలంలో 15 వేల మందిని సర్వే చేసి 7,500 మంది లబ్ధిదారులను గుర్తిస్తారు. ఎన్‌డీఎల్ రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఉన్న టాబ్లెట్‌ల ద్వారా ఈ సర్వేను పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఇప్పటికే మీసేవ ఆపరేటర్లకు టాబ్లెట్‌లు అందజేశారు. మొదటి దశలో సూర్యాపేట మండలంలో 7,500 మందిని డిజిటల్ విద్యావంతులుగా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
 
 అందులో భాగంగా ఎల్-1 పథకంలో 20గంటల శిక్షణ, ఎల్-2 కింద 40 గంటల శిక్షణ అందజేయనున్నారు. కుటుం బంలో ఒకరిని సాంకేతిక విద్యావంతులు చేసి వారికి కంప్యూటర్ వినియోగం, ఈ మెయిల్స్ పంపించడం, స్వీకరించడం వంటి జ్ఞానాన్ని అందించే దిశగా ఈ శిక్షణ సాగనుంది. శిక్షణ సమయంలో లబ్ధిదారులకు భృతిని ఇస్తారు. ఎల్-1 శిక్షణకు రూ.300 చొప్పున, ఎల్-2 శిక్షణకు రూ.600 చొప్పున అందించనున్నారు. వచ్చే నెల 10వ తేదీలోగా సర్వే పూర్తి చేసి మార్చి 31 వరకు శిక్షణ ముగించేందుకు సంబంధిత అధికారులు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.
 
 ఇంటికొకరు విద్యావంతులుగా మారే అవకాశం
 గ్రామీణ ప్రాంతంలో క్షేత్రస్థాయిలో పక్కాగా ఈ పథకం అమలైతే ఇంటికి ఒకరు విద్యావంతులుగా మారే అవకాశం ఉంటుంది. మొదటి దశలో సూర్యాపేట మండలం ఎంపిక కావడం మండల ప్రజల అదృష్టంగా భావించవచ్చు. అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి.
 - బొమ్మగాని నాగలక్ష్మి, విద్యార్థిని, పిల్లలమర్రి గ్రామం
 
 త్వరలో సర్వే ప్రారంభం
 త్వరలో సర్వే ప్రారంభించి వచ్చే నెల 10వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది. ఇటీవల శిక్షణ ఇచ్చారు. గ్రామా ల్లో సర్వే చేసి వివరాలను ఎప్పటికప్పుడూ ప్రభుత్వానికి అందించేందుకు టాబ్లెట్‌లు అందజేశారు. టాబ్లెట్‌లోనే కుటుంబానికి సంబంధించిన వివరాలు ఎలా సేకరించాలో ఉంటుంది.
 - సంతోష్‌కుమార్, మీసేవ ఆపరేటర్, రాయినిగూడెం
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement