* ఎంసెట్ కన్వీనర్ వెల్లడి
* పరీక్షకు 94 శాతం విద్యార్థుల హాజరు
* 24న ప్రాథమిక కీ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2014 ర్యాంకులను జూన్ 9న వెల్లడిస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణరావు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో ప్రవేశాల కోసం గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షకు మొత్తంగా 94.34 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష రాసేందుకు 3,95,670 మంది దరఖాస్తు చేసుకోగా 3,73,286 మంది హాజరయ్యారని వెల్లడించారు. ఒక్క ఇంజనీరింగ్‌లోనే 2,82,815 దరఖాస్తు చేసుకోగా 2,66,895 (94.37 శాతం) మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 1,12,855 మంది దరఖాస్తు చేసుకోగా 1,06,391 (94.27 శాతం) మంది హాజరయ్యారని వివరించారు. పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని ఈనెల 24న విడుదల చేస్తామని పేర్కొన్నారు. దానిపై ఈనెల 31 వరకు అభ్యంతరాలు స్వీకరించి జూన్ 9న ర్యాంకులను వెల్లడిస్తామని తెలిపారు.
విజయవాడలో అత్యధికంగా హాజరు: ఎంసెట్‌లో మెడికల్ పరీక్షకు విజయవాడలో ఎక్కువ మంది విద్యార్థులు (98.25 శాతం) హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లోనూ విజయవాడలో 96.26 శాతం మంది పరీక్ష రాశారు. ఇంజనీరింగ్‌లో తక్కువ హాజరు శాతం ఆదిలాబాద్‌లో (88.31%) నమోదైంది. అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో తక్కువ హాజరు శాతం విజయనగరంలో (88.09%)నమోదైంది. హైదరాబాద్‌లో ఇంజనీరింగ్‌లో 91.67%, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 95.09% హాజరు నమోదైంది.
కఠినంగా మ్యాథ్స్ పేపర్..: ఎంసెట్ ఇంజనీరింగ్ సబ్జెక్టులో మ్యాథ్స్ ప్రశ్నలు కొంత కఠినంగా వచ్చాయని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. గురువారం జరిగిన ఎంసెట్ పరీక్ష అనంతరం ఇంజనీరింగ్ రాసిన విద్యార్థులు తమకు సమయం సరిపోలేదని తెలిపారు. మ్యాథ్స్‌లో సమస్యలు పెద్దవి ఇవ్వడం.. ఫార్ములా ప్రకారం వాటిని లెక్కించి రాసేందుకు సమయం సరిపోలేదని వెల్లడించారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ అభ్యర్థులకు మ్యాథ్స్ ఉండదు కనుక ఇంజనీరింగ్‌కు ఎక్కువ సమయం ఇవ్వాల్సిందన్నారు. మ్యాథ్స్‌లో సమస్యలు పెద్దవి ఇవ ్వడం వల్ల ఫిజిక్స్, కెమిస్ట్రీ పేపర్లకు టైం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జూన్ 9న ర్యాంకులు
Published Fri, May 23 2014 3:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement