విమానాశ్రయంలో ఎబోలా పరీక్షలు
శంషాబాద్: ఆరు నెలలుగా పశ్చిమ ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ఎబోలా వ్యాధితో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో వైద్యబృందాలు ప్రయాణికులకు నిరంత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల దేశరాజధానిలోని ఢిల్లిలో ఓ ప్రయాణికుడి వ్యాధి లక్షణాలు కనిపించడంతో విమానాశ్రయాల్లో వైద్యపరీక్షలు మరింత పకడ్భందిగా నిర్వహిస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఇరవైనాలుగగంటల పాటు 28 మంది వైద్య బృందంతో పశ్చిమాఫ్రికా, గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన వైద్యాధికారి మహేష్ ‘సాక్షి’కి తెలిపారు.
జులై నుంచి కొనసాగుతున్న వైద్య పరీక్షల్లో ఇప్పటి వరకు 2500 మంది ప్రయాణికులకు స్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. పదిహేను రోజుల కిందట కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వైద్య పరీక్షలకు సంబంధించిన ఉన్న సదుపాయాలను కూడా పరిశీలించింది. ప్రధానంగా ఒళ్లునొప్పులు, వాంతులు, దగ్గు, ర్యాష్ వంటి లక్షణాల తీవ్రత ఉన్న వాళ్లను పరీక్షించి వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఎబొలో ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఇంతవరకు తీవ్ర ఉన్న కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు.