
‘బడి’ దోపిడీకి అడ్డుకట్ట
ప్రైవేట్ పాఠశాలల దూకుడుకు కళ్లెం
అడ్డగోలు ఫీజుల వసూళ్లకు ముకుతాడు
విద్యాహక్కు చట్టం అమలుకు ఆదేశాలు
కొనసాగుతున్న విద్యాశాఖ తనిఖీలు
ఖమ్మం : ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ప్రచార ఆర్భాటం, హంగులతో విద్యార్థుల తల్లిదండ్రులను ప్రలోభాలకు గురి చేసే ప్రైవేట్ విద్యాసంస్థలకు కళ్లెం వేసేందుకు జిల్లా విద్యాశాఖ పూనుకుంది. అధిక ఫీజుల వసూళ్లు, నిబంధనలకు విరుద్దంగా పాఠశాలల్లో దుస్తులు, పుస్తకాలు, ఇతర వస్తువులు అధిక ధరల అమ్మకాలకు అడ్డుకట్ట వేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. విద్యాహక్కు చట్టం అమలు చేయాలని, నిబంధనలకు లోబడి ఫీజులు వసూళ్లు చేయాలని జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. వీటిని పర్యవేక్షించాల్సిందిగా డివిజన్, మండల విద్యాశాఖ అధికారులకు జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పాటించాల్సిన నిబంధనలు
పాఠశాలలు తెరవడానికి ముందు ఆయూ స్కూల్ యూజమాన్యాలు గవర్నింగ్ బాడీ సమావేశం ఏర్పాటు చేయూలి. ఫీజు, ఇతర నిబంధనల గురించి చర్చించి నిర్ణయం తీసుకోవాలి. పాఠశాల నోటీస్ బోర్డుపై ఫీజు తదితర వివరాలను ఉంచాలి. గవర్నింగ్ బాడీ నిర్ణయించి ఫీజులను ప్రతి పాఠశాల పాటించాలి. గవర్నింగ్‌బాడీ డీఈవో అనుమతిపొందిందై ఉండాలి. ఆర్టీవో సూచించిన నిబంధనల మేరకు పాఠశాల బస్‌ను నడపాలి. అనుమతులు తీసుకోవాలి.
ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. డీఎఫ్‌వో సూచించిన విధంగా అగ్నిప్రమాదాల నుంచి రక్షణ పొందే చర్యలను పాటించాలి. పాఠశాల బిల్డింగ్ ఆవరణలో ఫైర్‌సేఫ్టీ నిబంధనలను పాటించేలా చూడాలి. ఎటువంటి ఎంట్రన్స్ టెస్ట్‌లు లేకుండానే విద్యార్థులను చేర్చుకోవాలి. పాఠశాలలో తప్పనిసరిగా ప్రాథమిక చికిత్స కిట్‌ను ఉంచాలి. దీని నిర్వహణపై ఓ టీచర్‌కు శిక్షణ ఇప్పించాలి. పాఠశాల పరిసరాల్లో మంచినీటి వసతి కల్పించాలి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అదనపు సెక్షన్‌లు నిర్వహించకూడదు.
కాగితాలకే పరిమితమైన ఆదేశాలు...
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అనుసరించాల్సిన విధానాలపై ప్రభుత్వ నిబంధనలు స్పష్టంగా ఉన్నా జిల్లాలో మాత్రం అత్యధిక స్కూల్స్ వీటిని పాటించటం లేదని ఆరోపణలు వస్తున్నారుు. జిల్లాలో 2,979 ప్రభుత్వ పాఠశాలలతోపాటు, 506 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. పాఠశాలల వసతులు, బోధన వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకొని పాఠశాల యాజమాన్య కమిటీల నిర్ణయం మేరకు ఫీజులు వసూళ్లు చేయాలి.
కానీ జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, సత్తుపల్లి, మణుగూరు వంటి పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. నర్సరీ విద్యార్థికి రూ. 10వేలకు పైగా స్కూల్ ఫీజు, ఇదికాక అడ్మీషన్ పీజు, పెద్ద తరగతులకైతే ఐఐటీ, ఇతర ఫౌండేషన్ కోర్సుల పేరిటి రూ. 50వేల వరకు దండుకుంటున్నారు. ఇక్కడితో ఆగకుండా దుస్తులు, పుస్తకాలు, నోట్ బుక్స్, టై, బ్యాడ్జీల వంటివి పాఠశాలల్లోనే అధిక ధరలకు విక్రరుుస్తున్నారు.
ఇదేమని ప్రశ్నిస్తే అడ్మీషన్ రద్దు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు అంటే తెలియని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇంత జరుగుతున్నా ప్రైవేట్ దూకుడుకు కళ్లెం వేయడంలో విద్యాశాఖ విఫలమవుతోందనే ఆరోపణలు వస్తున్నారుు. పాఠశాల ప్రారంభానికి ముందు హడావిడి చేసి ఆ తర్వాత మిన్నకుంటున్నాయని కూడా అభియోగాలున్నారుు.
పాఠశాల పేరుకు ముందు ఐఐటీ, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఈ-టెక్నో, ఈ-శస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ తదితర పేర్లను వాడకూడదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా పాఠశాలలో సిలబస్ బోధించాలి.
పాఠశాలలు తప్పనిసరిగా ఆర్‌టీఈ చట్టం-2009ని అనుసరించాలి. పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, స్కూల్‌బ్యాగ్స్, షూస్‌ను బడిలో విక్రరుుంచొద్దు. పాఠశాల యాజమాన్యాలు క్వాలిఫైడ్ సిబ్బందినే నియమించాలి.