- ‘సాక్షి’తో గిరిజన సంక్షేమశాఖ మంత్రి చందూలాల్
సాక్షి, హైదరాబాద్: ఏజెన్సీ, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు వాటర్‌గ్రిడ్, ఇతర కార్యక్రమాల ద్వారా స్వచ్ఛమైన మంచి నీటిని అందించడం తమ ప్రథమ ప్రాధాన్యమని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు. ప్రస్తుతం చెరువులు, కుంటలు, వాగుల నుంచి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితులను సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో మార్పు చేసేందుకు కృషి చేస్తామన్నారు.
మారిన పరిస్థితులకు అనుగుణంగా గిరిపుత్రులను విద్యాపరంగా పరిపుష్టం చేయడంతో పాటు వారి ఆరోగ్యాల పరిరక్షణకు కచ్చితమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేబినెట్ విస్తరణలో భాగంగా గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా నియమితుడైన ఆయన బుధవారం ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. రోడ్లు, విద్యుత్ సరఫరా, స్కూళ్ల ఏర్పాటు, కమ్యూనికేషన్ల వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావడం వంటి చర్యలను చేపడతామన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో, అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలను పూర్తిస్థాయిలో అమలుచేస్తామని మంత్రి చెప్పారు. తండాల అభివృద్ధి, వాటిని గ్రామపంచాయతీలుగా మార్చడం, గిరిజనులకు మూడెకరాల భూమి పంపిణీ, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు వంటి వాటిని ప్రణాళికాబద్ధంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
సమైక్యరాష్ట్రంలో గిరిజనుల బడ్జెట్, ఉప ప్రణాళిక నిధులను ఏ మాత్రం సంబంధంలేని అంశాలకు ఖర్చు చేసిన పరిస్థితి ఉందన్నారు. ప్రస్తుతం సబ్‌ప్లాన్ నిధులను పకడ్బందీగా ఖర్చు చేసేందుకు, ఆయా పథకాలు,కార్యక్రమాలను కచ్చితంగా అమలు చేసేందుకు అవకాశం ఉందని మంత్రి చందూలాల్ తెలిపారు.