గుడ్లు తేలేయాల్సిందే! | Eggs Prices Hikes in Telangana | Sakshi
Sakshi News home page

గుడ్లు తేలేయాల్సిందే!

Published Thu, Dec 12 2019 8:03 AM | Last Updated on Thu, Dec 12 2019 10:11 AM

Eggs Prices Hikes in Telangana - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: కోడిగుడ్ల ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. కొన్ని రోజులుగా నగరంలో గుడ్ల వినియోగం విపరీతంగా పెరగడం.. చలితో దిగుబడి తగ్గడంతో ధరలు మండుతున్నాయి. సాధారణ రోజుల్లో జంట నగరాల్లో రోజుకు సుమారు 45 లక్షల గుడ్ల అమ్మకాలు జరుగుతుండగా.. గతవారం నుంచి రోజుకు 60 లక్షలకు పైగా అమ్ముడవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో «గుడ్డు ధర కూడా రికార్డు స్థాయిలో పెరిగిందంటున్నారు. హోల్‌సేల్‌ మార్కెట్‌లో గుడ్డు ధర రూ.5.50 ఉండగా, రిటైల్‌ మార్కెట్‌లో రూ.6గా ఉంది. ఇక నగర శివారు ప్రాంతాల్లో అదే గుడ్డు రూ.6.50 పైసల నుంచి రూ.7 వరకు కిరాణా షాపుల్లో విక్రయిస్తున్నారు. 

వినియోగంలో మనదే పైచేయి..
దేశంలో అత్యధికంగా గుడ్ల ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తర్వాత తెలంగాణ మూడోస్థానంలో ఉన్నాయి. అయితే, తలసరి వినియోగంలో మాత్రం తెలంగాణనే ప్రథమ స్థానంలో ఉంది. రాష్ట్రంలో రోజుకు 3.25 కోట్ల గుడ్ల ఉత్పత్తి అవుతుండగా, ఇందులో 60 శాతం ఇక్కడే వినియోగిస్తున్నారు. మిగితా 40 శాతం గుడ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. ఉత్పత్తిలో ప్రధమ, ద్వితీయ స్థానాల్లో ఉన్న ఆంధ్ర, తమిళనాడుల్లో మాత్రం స్థానికంగా 50 శాతం కంటే తక్కువగా వినియోగిస్తున్నారు. జాతీయ పౌష్టికాహార సంస్థ సూచన ప్రకారం ఒక వ్యక్తి ఏడాదికి 180 గుడ్లు తినాలి. అయితే, దేశంలో తెలంగాణలో మాత్రమే అత్యధికంగా సగటున ఒక్కో వ్యక్తి 174 గుడ్లు తింటున్నట్టు నివేదిలో పేర్కొంది. 

గ్రేటర్‌లో 60 లక్షల వినియోగం
గ్రేటర్‌ శివారు ప్రాంతాల్లో వెలిసిన కోళ్ల ఫారాల్లో అత్యధికంగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల నుంచి ఎక్కువ గుడ్లు నగరానికి దిగుమతి అవుతున్నాయి. అలా ఒక్క హైదరాబాద్‌లోనే రోజుకు 60 లక్షల గుడ్లు వినియోగిస్తున్నట్టు వ్యాపారులు చెబుతున్నారు. చలికాలంలో గుడ్ల వినియోగం పెరగడం సహజం. దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న గుడ్లు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు ఎగుమతి అవుతున్నాయి. ఇది కూడా ధరల పెరుగుదలకు ఓ కారణంగా హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా చలికాలంలో గుడ్ల ధర పెరుగుతుంది. అయితే, అనుకున్న స్థాయిలో ఉత్పత్తి మాత్రం లేదని ‘నెక్‌’ బిజినెస్‌ మేనేజర్‌ సంజీవ్‌ చింతావర్‌ తెలిపారు. కోళ్ల దాణా ధరలు సైతం విపరితంగా పెరిగాయని, ఆ ప్రభావం కూడా గుడ్ల ధరపై పడిందంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement