కుమారుడి అప్పు కింద తల్లి పింఛన్ జమ!
వెంకటాపురం (నూగూరు): కుమారుడు బ్యాం కులో తీసుకున్న అప్పు కింద తల్లి ఆసరా పింఛన్‌ను జప్తు చేశారు బ్యాంకు అధికారులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంక టాపురం(నూగూరు) మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన కోగిల భూషమ్మ అనే వృద్ధురాలు ఆసరా పింఛన్ తీసుకునేందుకు గురువారం ఉదయం స్థానిక ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లింది.
అయితే, అదే బ్యాంక్‌లో భూషమ్మ కుమారుడు కోగిల వెంకటేశ్వర్లు 3,900 రూపాయలు బాకీ ఉన్నాడు. ‘అతడు అప్పు తీర్చడం లేదు, నీకు వచ్చే ఆసరా పింఛన్‌ను నీ కొడుకు బాకీ కింద జమ చేసుకుంటున్నాం’ అని బ్యాంకు అధికారులు చెప్పారు. రూ.1,000 వెంక టేశ్వర్లు అకౌంట్‌లో జమ చేసుకుని రసీదును వృద్ధురాలు చేతిలో పెట్టారు. తన కొడుకు అప్పు ఉంటే ఆయన వద్ద కట్టించుకోకుండా తన పింఛన్ డబ్బులను బ్యాంక్ అధికారులు జమ చేసుకు న్నారని భూషమ్మ కంటతడి పెట్టింది.
ఈ విషయంపై వృద్ధురాలు ఎంపీడీవో బెక్కంటి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎంపీడీవోను వివరణ కోరగా.. బ్యాంక్ అధికారులు వృద్ధురాలి ఆసరా పింఛన్ సొమ్మును కొడుకు అప్పు కింద జమ చేసుకున్నట్లు తమకు ఫిర్యాదు వచ్చిందని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన తెలిపారు.