నర్సాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, మహాకూటమి తరఫున మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి సింగాయపల్లి గోపి, బీఎల్‌ఎఫ్ నుంచి అజ్జమర్రి మల్లేశం బరిలో నిలిచారు. ప్రభుత్వ పథకాలు, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధే మరోసారి తన గెలుపునకు బాటలు వేస్తాయని సిట్టింగ్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి చెబుతుండగా, మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, ప్రభుత్వ వైఫల్యాలు కలిసి వస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు సునీతారెడ్డి. ఎవరికి వారు గెలుపుపై భరోసాతో ఉన్నారు.
సాక్షి, మెదక్: కమ్యూనిస్టు కంచుకోటగా నర్సాపూర్‌కు పేరుంది. సీపీఐ నుంచి విఠల్‌రెడ్డి ఇక్కడి నుంచి ఐదుమార్లు గెలుపొందారు. దివంగత మాజీ డిప్యూటీ సీఎం జగన్నాథరావు ఇక్కడి వారే. నియోజకవర్గం పరిధిలో మొత్తం 8 మండలాలు, నర్సాపూర్ మున్సిపాలిటీ ఉంది. తాజా మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్‌తో సాన్నిహిత్యంతో నియోజకవర్గానికి దాదాపు రూ. 2 వేల కోట్ల నిధులు తీసుకు వచ్చి పలు అభివృద్ధిపనులు చేపట్టారు. టీఆర్‌ఎస్ అధిష్టానం ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ఆయనకే మరోసారి టికెట్ ఇచ్చి బరిలో దించింది. మహాకూటమి తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి సునీతారెడ్డి బరిలో నిలిచారు. బీజేపీ నుంచి సింగాయపల్లి గోపీ, బీఎల్‌ఎఫ్ నుంచి అజ్జమర్రి మల్లేశం పోటీ చేస్తున్నారు. ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నడుమనే సాగే అవకాశం ఉంది. అభివృద్ధే అస్త్రంగా తాజా మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి.. ప్రభుత్వ వైఫల్యాలే ఆయుధంగా మహాకూటమి అభ్యర్థి సునీతా రెడ్డి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇద్దరు గెలపు మాదంటే మాదనే ధీమాతో ముందుకు సాగుతున్నారు.
వాకిటి సునీతారెడ్డి(కాంగ్రెస్ అభ్యర్థి)
మాజీ మంత్రి సునీతారెడ్డి నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు గెలుపొందారు. భర్త లక్ష్మారెడ్డి మృతితో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమె 1999లో మొదటి సారిగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో సీపీఐ నేత విఠల్‌రెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లోనూ సునీతారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సునీతారెడ్డి ఓటమిపాలయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు తనదేనన్న దీమాతో ముందుకు సాగుతున్నారు.
సింగాయపల్లి గోపి (బీజేపీ అభ్యర్థి)
వెలమ సామాజిక వర్గానికి చెందిన సింగాయపల్లి గోపీ బీజేపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. బీజేపీ జిల్లా స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన 2009 ఎన్నికల్లో బీజేపీ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం జరబోయే ఎన్నికల్లో మరోమారు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు తనను గెలిపిస్తాయని ఆయన ఆశతో ఉన్నారు.
సోమన్నగారి లక్ష్మి(బీఎస్పీ అభ్యర్థి)
కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన సోమన్నగారి లక్ష్మీ బీఎస్పీ తరపున మొదటి సారిగా ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఆమె రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి నర్సాపూర్ టికెట్ కోసం పోటీ పడ్డారు. టికెట్ దక్కకపోవటంతో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ వేశారు. ఆతర్వాత పార్టీ పెద్దల సూచనలతో నామినేషన్ ఉపసహరించుకుని మదన్‌రెడ్డి గెలుపుకోసం పనిచేశారు. ఈ సారి సైతం టీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోవటంతో బీఎస్పీ తరపున పోటీ చేస్తున్నారు. బీసీ ఓటర్లు తనకు అండగా ఉంటారని ఆమె భావిస్తున్నారు.
అజ్జమర్రి మల్లేశం(సీపీఎం)
సీపీఐ(ఎం) పార్టీ తరపున మొదటి సారిగా అజ్జమర్రి మల్లేశం ఎమ్మెల్యేగా పోటీ పడుతున్నారు. హత్నూర మండలం కాసాల గ్రామానికి చెందిన మల్లేశం సీపీఎం పార్టీలో కొనసాగుతున్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన నర్సాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు తనను గెలిపిస్తాయని ఆయన నమ్మకంగా ఉన్నారు.
అభివృద్ధి పనులు..
సంక్షేమ పథకాలు..
రూ.430 కోట్లతో నియోకజవర్గం గుండా వెళ్లే జాతీయ రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి.
రూ.10 కోట్లతో నర్సాపూర్‌లో బస్‌డిపో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నియోజకవర్గంలో రూ.41.47 కోట్లతో చెరువుల పునరుద్ధ్దరణ పనులు చేపట్టారు.
రూ.74 కోట్లతో మంజీరా నదిపై కొత్తగా పది చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.
రూ.1.67 కోట్లతో నర్సాపూర్ మార్కెట్‌యార్డులో అభివృద్ధి పనులు చేపట్టారు.
నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని 130 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు.
రూ.1.70 కోట్లతో గిరిజన బాలుర పోస్టు మెట్రిక్ కళాశాల నిర్మాణం పనులు చేపట్టారు.
రూ.54 కోట్లతో గిరిజన తండాల్లో రహదారుల నిర్మాణం చేపట్టారు.
సంగారెడ్డి–నర్సాపూర్–తూప్రాన్ రోడ్డు విస్తరణ పనులను రూ.25 కోట్లతో చేపట్టారు.
పంచాయతీరాజ్ నిధుల ద్వారా సుమారు రూ.20 కోట్లతో నియోజకవర్గంలో రహదారుల నిర్మాణం పనులు చేపట్టారు.
3031 మంది లబ్ధిదారులకు సబ్సిడీ గొర్రెలు అందించారు.
115 మంది రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లను అందజేశారు.
ప్రధాన సమస్యలు..
నియోజకవర్గంలో ప్రవహిస్తున్న మంజీరా నదిపై ఎత్తిపోతల పథకాల పనులు పనిచేయటంలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి.
నర్సాపూర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నట్లు కేసీఆర్ ప్రకటించినప్పటికీ ఒక్క సారి సైతం నియోజకవర్గంలో పర్యటించలేదన్న అసంతృప్తి స్థానికుల్లో ఉంది.
నియోజకవర్గంలో మిషన్‌భగీరథ ద్వారా పూర్తిస్థాయిలో ఇంకా ఇంటింటికి తాగునీరు అందలేదు.
డబుల్‌బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాలేదు.
నియోజకవర్గాన్ని డివిజన్ కేంద్రంగా ప్రకటించినా ఇంకా పూర్తిస్థాయిలో కార్యాలయాలు ఏర్పాటు కావాల్సి ఉంది.
సిట్టింగ్ ప్రొఫైల్
కేసీఆర్‌కు సన్నిహితుడైన తాజా మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి స్వస్థలం కౌడిపల్లి. సీపీఐ నేత, దివంగత ఎమ్మెల్యే చిలుముల విఠల్‌రెడ్డి సోదరుడైన మదన్‌రెడ్డి ఉపసర్పంచ్‌గా రాజకీయ జీవితం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ఆ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా, జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్రపార్టీలో వివిధ హోదాల్లో ఉన్నారు. ఆ సమయంలో ప్రస్తుత సీఎం కే.చంద్రశేఖర్‌రావుతో సన్నిహితంగా మెలిగారు.
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పనిచేశారు. 1999, 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో నర్సాపూర్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూశారు. 2012లో మదన్‌రెడ్డి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్యేగా పోటీచేసిన మదన్‌రెడ్డి 14,217 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మరోమారు తలపడుతున్నారు.
భారీ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు స్వయంగా నర్సాపూర్ నియోకజవర్గంలో పార్టీ గెలుపుకోసం వ్యూహారచన చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాం నింపుతున్నారు. మదన్‌రెడ్డిని ముందుండి నడిపిస్తున్నారు.
2014 పోల్‌గ్రాఫ్
మొత్తం ఓటర్లు: 2,08,623
పోలైన ఓట్లు: 1,75,053
వాకిటి సునీతారెడ్డి(కాంగ్రెస్) 71,673
చిలుముల మదన్‌రెడ్డి (టీఆర్‌ఎస్) 85,890
మెజార్టీ: 14,217
2018 ఓట్ గ్రాఫ్
మొత్తం ఓటర్లు: 2,01,580
మహిళా ఓటర్లు 1,02,312
పురుష ఓటర్లు 99,624
ఇతరులు: 4
పోలింగ్ కేంద్రాలు: 277
Comments
Please login to add a commentAdd a comment