
సాక్షి, మహబూబాబాద్: గత ఎన్నికల్లో వారు పోటాపోటీగా బరిలో నిలిచారు. ప్రత్యర్థి ఓటమే లక్ష్యంగా వ్యూహాలు పన్నారు. కాలంగిర్రున తిరిగింది. ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీలో ప్రాధాన్యత దక్కకపోవటం.. ఇతర కారణాలేవైనా ఒక్కసారిగా సమీకరణలు మారిపోయాయి. గత ఎన్నికల్లో ఎవరినైతే ఓడించాలని శతవిధాలా ప్రయత్నించారో ఇప్పుడు వారికే మద్దతుగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నారు. వారి గెలుపుకోసం స్వయంగా ప్రచారం చేస్తున్నారు.
కత్తులు దూసుకున్నవారే
2014 ఎన్నికల్లో మానుకోట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున మాలోతు కవిత, టీఆర్‌ఎస్ తరఫున శంకర్‌నాయక్ తలపడ్డారు. డోర్నకల్‌లో కాంగ్రెస్ నుంచి రెడ్యానాయక్, టీఆర్‌ఎస్ నుంచి సత్యవతి రాథోడ్ పోటీపడ్డారు. మారిన రాజకీయ సమీకరణలతో గెలిచిన రెడ్యానాయక్, ఓడిపోయిన మాలోతు కవిత టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అందరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఎడమోహం పెడమోహంలాగా కొనసాగారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర విమర్శలు సైతం చేసుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి టిక్కెట్ కోసం ఇరువురు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. కానీ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగ్‌లకే సీట్లు ఇచ్చారు. దీంతో వీరు సహాయ నిరాకరణ చేశారు. కేసీఆర్, కేటీఆర్ అసంతృప్తులతో మాట్లాడి పార్టీ గెలుపుకోసం కృషిచేయాలని ఆదేశించారు. దీంతో మాలోత్ కవిత తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయకు మద్దతుగా, సత్యవతి రాథోడ్ రెడ్యానాయక్ గెలుపుకోసం ప్రచారం చేస్తున్నారు.
గెలుపు కోసం ప్రచారం
నియోజకవర్గ సమన్వయ సమావేశం ఆపద్ధర్మ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన ఇటీవల నిర్వహించారు. కడియం ప్రయత్నాలు ఫలించకపోవడంతో కేటీఆర్ రంగంలోకి దిగారు. పార్టీని గెలిపించండి భవిష్యత్‌లో మీకు అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. దీంతో అలకవీడిన సత్యవతి, కవిత టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలపుకోసం నేరుగా ప్రజాక్షేత్రంలోకి దిగారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment