
రూ.10 లక్షల నగదును పరిశీలిస్తున్న కలెక్టర్ ఎంవీ రెడ్డి
కీసర: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, ప్రజలెవరైనా రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదుతో ప్రయాణిస్తే ఆ నగదుకు సంబంధించి సరైన పత్రాలు వెంటబెట్టుకొని వెళ్లాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు. గురువారం కీసరగుట్ట కమాన్ సమీపంలోని చెక్‌పోస్ట్ వద్ద కీసర ఎంసీసీ టీం ఆధ్వర్యంలో చేపట్టిన వాహనాల తనిఖీల్లో భాగంగా పట్టుకున్న రూ.10 లక్షల నగదును కలెక్టర్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం అక్రమ నగదును అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. అక్రమంగా తరలించే నగదును పట్టుకునేందుకు జిల్లా వ్యాప్తంగా 18 ఫ్లయింగ్‌స్క్వాడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పంపిస్తున్నామని కలెక్టర్ స్పష్టంచేశారు.
రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదును వెంటబెట్టుకొని వెళ్లే వ్యక్తులు సదరు నగదుకు సరైన ఆధారాలు చూపించకుంటే సీజ్ చేస్తామన్నారు. నగరంలోని మౌలాలీకి చెందిన కొండవీటి రాయన్న తన కారులో గురువారం ఉదయం రూ.10 లక్షల నగదుతో ప్రయాణిస్తున్నారని, కీసరగుట్ట కమాన్ వద్ద కీసర ఎంసీసీ టీం ఎంపీడీఓ వినయ్‌కుమార్, కీసర తహాసీల్దార్ నాగరాజు బృందం రాయన్న కారును తనిఖీ చేయగా లభించిన నగదును సీజ్ చేశామన్నారు. సరైన« ఆధారాలు చూపించిన తర్వాతే నగదును రాయన్నకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. కాగా.. తాను అంకిరెడ్డిపల్లిలో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశానని, భూమి విక్రయించిన వ్యక్తులకు చెల్లించేందుకు నగదును తీసుకెళ్తున్నట్లు రాయన్న అధికారులకు విన్నవించినట్లు సమాచారం. పూర్తి ఆధారాలు తీసుకువస్తే నగదును అప్పగిస్తామని అధికారులు రాయన్నకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment