సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం అధికారులు నియోజకవర్గానికి ఒకటి చొప్పున కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క కేంద్రంలో 14 టేబుళ్లు, రిటర్నింగ్ అధికారికి అదనంగా మరో టేబుల్ ఏర్పాటు చేస్తారు. కౌంటింగ్‌కు ముందు ప్రిసైడింగ్ అధికారి సంతకాలతో ఉన్న 17సీ ఫారం వివరాలు ఏజెంట్లకు తెలియజేస్తారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమౌతుంది. మొదటి అరగంటలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
17సీ ఫారంలో ఈవీఎంల వారీగా పోలైన ఓట్లవివరాలు ఉంటాయి(పోలింగ్ పూర్తయ్యాక నమోదు చేస్తారు). పోలైన ఓట్లు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరి చూసుకుంటారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు ఏజెంట్లకు కూడా చూపించి వారి సంతకాలు తీసుకుంటారు. వాటిని ఏజెంట్లు నోట్ చేసుకున్న అనంతరం ఈవీఎంల సీల్ ను తొలగించి రిజల్ట్ బటన్ ను నొక్కుతారు. వెంటనే అభ్యర్థుల వారీగా...వారికి పోలైన ఓట్లు వెలువడతాయి.
ఒక్కొక్క రౌండ్లో 14 ఈవీఎంల ఫలితాలు వెల్లడవుతాయి. పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి రౌండ్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద సూపర్వైజర్,అసిస్టెంట్ సూపర్ వైజర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. లెక్కింపు ప్రక్రియ అంతా రాజకీయ పార్టీలు, ఏజెంట్ల సమక్షంలో సాగుతుంది. ప్రతి రౌండ్ ఫలితాన్ని వారు సంతృప్తి చెందిన తర్వాతే వెల్లడిస్తారు. కౌంటింగ్ పూర్తయ్యిన అనంతరం అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో ఏదయినా ఒకే వీవీ ఫ్యాట్ లోని ముద్రిత ఓటర్ స్లిప్పులను లెక్కిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment