సాక్షి, హైదరాబాద్: పురపోరు ముగిసేవరకు మున్సిపల్ ఉద్యోగులకు సెలవుల్లేవని, ఇప్పటికే సెలవులో వెళ్తే తక్షణమే వెనక్కి పిలిపించాలని పురపాలక శాఖను రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) ఆదేశించింది. సగటున ఒక్కో పోలింగ్‌స్టేషన్‌లో 800 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఆ పరిధి దాటితే కచ్చితంగా రెండో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ స్టేషన్లనే పుర పాలక సంస్థల ఎన్నికలకూ వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే పోటీకి అనర్హులన్న నిబంధన ఇప్పుడు లేదని స్పష్టం చేసింది. 2019 జనవరి 1 నాటికి కనీసం 18 ఏళ్ల వయసు నిండి, ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఓటేసేందుకు అర్హులని, ఆ మేరకు జాబితాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
ఓటర్ల జాబితాల్లో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు పడాలని, వార్డు ఓటర్లు అదే వార్డులో వచ్చేలా రెండ్రోజుల్లో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించింది. టీ–పోల్ యాప్‌ను ఒకట్రెండు రోజుల్లో అప్‌డేట్ చేయనున్నట్లు పేర్కొంది. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అభ్యర్థుల వ్యయం పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. వచ్చే నెల 7న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో మంగళవారం ఎస్‌ఈసీ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లపై కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్, జిల్లాల కమిషనర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనవద్దు..
ఒక పోలింగ్ స్టేషన్ లో 800 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి సూచించారు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని తెలిపారు. క్రిస్మస్ పండుగ నేపథ్యంలో అధికారులు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనొద్దని, ప్రభుత్వం తరఫున ఎలాంటి బ్యానర్లు పెట్టొద్దని సూచించారు. ఎన్నికల ఏర్పాట్లపై ఈనెల 27న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్, 28న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
చకచకా ఏర్పాట్లు..
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగా, జనవరి 7న ఎస్‌ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండటంతో మిగిలిన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో పోలిస్తే మున్సిపల్ ఓటర్ల సంఖ్య ఈ సారి భారీగా పెరగ్గా, ఒకే దశలో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పా ట్లు చేస్తోంది. వార్డుల విభజన, ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ పూర్తికావస్తోంది. వార్డుల రిజర్వేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్లు చేపట్టనున్నారు. మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో చేపడతారు.
Comments
Please login to add a commentAdd a comment