ముగిసిన ఎన్నికల ప్రచారం..  | Election Compaign Completed For Loksabha Elections | Sakshi
Sakshi News home page

ముగిసిన ఎన్నికల ప్రచారం..

Published Wed, Apr 10 2019 10:32 AM | Last Updated on Wed, Apr 10 2019 10:33 AM

Election Compaign Completed For Loksabha Elections - Sakshi

ప్రచార వాహనానికి ఫ్లెక్సీని తొలగిస్తున్న కార్యకర్త

సాక్షి, మహబూబ్‌నగర్‌: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. నిన్నటి వరకు ప్రచారాలతో హోరెత్తించిన పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంలో నిమగ్నమయ్యాయి. పక్షం రోజుల పాటు అవిశ్రాంతంగా తమ తమ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో చుట్టివచ్చిన అభ్యర్థుల శ్రమ ఏ మేరకు ఫలితమిస్తుందో అనే చర్చ మొదలైంది. అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానాల్లో ఎవరు గెలుస్తారు? ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి మొగ్గు చూపుతారు..? ప్రజలు ఏ పార్టీని ఆదరిస్తారోనని సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తోంది.  

ఎవరికి జై కొడతారో? 
2014 ఎన్నికల్లో అప్పటి తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌కు జై కొట్టి టీఆర్‌ఎస్‌ అభ్యర్ధికి పట్టం కట్టిన పాలమూరు ఓటర్లు మళ్లీ అదే పార్టీ వైపు మొగ్గుచూపుతారా..?  జాతీయ రాజకీయాలకు ప్రభావితం చేసే ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకే జై కొడతారా..? లేక కాంగ్రెస్‌ను విశ్వసిస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీలన్నీ ఉమ్మడి పాలమూరు అభివృద్ధే ప్రధాన ఎజెండాగా విస్తృత ప్రచారం నిర్వహించిన ఈ పోరులో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనే దానిపై ఇప్పట్నుంచే చర్చ మొదలైంది. దీనికి తోడు ప్రజలను ఆకట్టుకునే విధంగా బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు తమ మేనిఫెస్టోలో పొందుపరించిన సంక్షేమ పథకాలను ప్రజలు ఏ మేరకు నమ్మారో ఈ లోక్‌సభ ఎన్నికల ఫలితాలతోనే స్పష్టం కానున్నాయి.  

తరలివచ్చిన అగ్రనేతలు 
ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని పార్టీల అతిరథ నేతలు పోటాపోటీగా బహిరంగ సభల్లో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగ సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్‌ పార్లమెంటు పరిధిలోని వనపర్తిలో జరిగిన సభల్లో సీఎం కేసీఆర్, రాహుల్‌గాంధీ పాల్గొన్నారు. వీరితో పాటు బీజేపీ తరుఫున కేంద్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ తరపున రాష్ట్ర మంత్రులు రెండు లోక్‌సభ స్థానాల్లోనూ పర్యటించారు.

ఆయా పార్టీలకు మద్దతుగా ప్రచారాలు నిర్వహించారు. ముఖ్యుల పర్యటన తర్వాత ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ప్రచారమంతా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు, జాతీయ హోదా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, జాతీయ రహదారుల మంజూరు, విస్తరణ, జిల్లాలో వలసల నివారణకు చర్యలు, పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపైనే కొనసాగింది. ఇదిలా ఉండగా ప్రచారం చివరి రోజూ బీజేపీ అభ్యర్థులు డి.కె.అరుణ, బంగారు శ్రుతి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు శ్రీనివాస్‌రెడ్డి, పి.రాములు, కాంగ్రెస్‌ అభ్యర్థులు వంశీచంద్, మల్లురవి తమతమ పార్లమెంటు పరిధిలో  విస్తృతంగా పర్యటించారు. ఆయా పార్టీ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించారు.  

పాలమూరుపై పాగా ఎవరిదో? 
కరువు జిల్లాగా పేరొందిన ఉమ్మడి జిల్లాలోని పాలమూరు, నాగర్‌కర్నూల్‌ ఎన్నికల ఫలితాలెలా ఉంటాయనేది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా పాలమూరులో ఏ పార్టీ అభ్యర్ధి గెలుస్తారో అనే దానిపై బెట్టింగ్‌లు సైతం కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పాలమూరు సీటు ప్రధాన పార్టీలన్నింటికీ ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ స్థానం నుంచి  సిట్టింగ్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇటీవల టీఆర్‌ఎస్‌ను వీడి కమల దళంలో చేరడం.. బీజేపీ ఎంపీ అభ్యర్థి డి.కె.అరుణ సైతం టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇస్తున్నారు.

రాజకీయాలకు కొత్త అయిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి తరుపున పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలందరూ విస్తృత ప్రచారం నిర్వహించారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఇద్దరిలో గెలుపెవరిదో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇదీలావుంటే ఉమ్మడి జిల్లాలో చతికిలపడ్డ కాంగ్రెస్‌ పార్టీలో గెలుపు ధీమా అంతంత మాత్రంగానే ఉంది. ఆ పార్టీ నుంచి బరిలో ఉన్న వంశీచంద్‌రెడ్డి టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులకు దీటుగా గట్టిపోటీ ఇవ్వలేకపోయారు. ఇటు నాగర్‌కర్నూల్‌ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ తొలిసారిగా పోటీ చేస్తుండడంతో అక్కడ గెలుపు గులాబీ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మధ్యలోనే పొటీ ఉంది. 

అందరిలోనూ గెలుపు ధీమా..! 
పక్షం రోజుల ప్రచారం అగ్రనేతల పర్యటనలపై ఆశలు పెట్టుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమాతో ఉన్నారు. ఎవరికివారుగా తమ నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తించారు. సకుటుంబ సపరివారంగా ఓటర్లను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థించారు. సాధ్యమైనంత వరకు ఓటర్లందరినీ కలిసే ప్రయత్నం చేశారు. కుల, మత, ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారు. దీంతో పాటు తమ అతిరథ నేతల సభలకు జనం భారీగా తరలిరావటం, పల్లెపల్లెనా ప్రచారానికి వచ్చిన స్పందన అభ్యర్థుల్లో గెలుపు అవకాశాలు నింపింది. ఇటు ప్రచారంతో పాటే ఎన్నికల ఖర్చులోనూ అభ్యర్థులు పోటీ పడ్డారు. అనేక చోట్లా ప్రచారం ముగిసిన వెంటనే మొదలైన ప్రలోభాల పర్వం రేపు పోలింగ్‌ పూర్తయ్యే వరకు కొనసాగనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement