ఎన్నికలు వచ్చాయంటే అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని సైతం ఉల్లంఘిస్తుంటారు. మద్యం, డబ్బు పంపిణీ, నిషేధిత ప్రదేశాల్లో సమావేశాలు ఏర్పాటు చేయడం తదితరాలకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరగడంతో నియమావళిని ఉల్లంఘిస్తే పట్టుకోవడం మరింత సులువవుతుంది. వీటన్నింటిని పరిశీలించేందుకు ఎన్నికల కమిషన్ ప్రత్యేక బృందాలను సైతం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన చట్టాలపై ప్రత్యేక కథనం.
సాక్షి,ఆలేరు : ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో ప్రజాప్రాతినిధ్య చట్టం (1951) ఐసీసీ సెక్షన్ 171 ప్రకారం కేసులు నమోదు చేస్తారు. అవి నిరూపితమైతే ప్రజాప్రతినిథ్య చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు. అభ్యర్థులు అతిక్రమించిన నిబంధనలకు అనుగుణంగా సబ్‌క్లాజ్‌ల వారీగా కేసులు నమోదు చేయాలంటే ముందుగా న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
నిరూపణ జరిగితే అనర్హుడిగా ప్రకటన
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే ఒక్కోసారి ప్రజాప్రతినిధి పదవికి గండం వచ్చే ప్రమాదముంది. కోడ్ ఉల్లంఘిస్తే సెక్షన్ 171లోని సబ్‌క్లాజ్‌ల కింద కేసులు నమోదు చేస్తారు. వీటి ప్రకారం జరిమానా లేదా జైలు శిక్షతోపాటు జరిమానా కలిపి విధించే అవకాశం ఉంటుంది. ఇవి నిరూపితమైతే ప్రజాప్రాతినిధ్య చట్టం (1961) ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుంది. నేర నిరూపణ జరిగితే అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించే అధికారం ఎన్నికల సెక్షన్–171 (ఎ) అభ్యర్థి ఎన్నికల హక్కులను తెలియజేస్తుంది. ఎన్నికల కోడ్ అమలవుతున్న సమయంలో అభ్యర్థులు చేయదగిన, చేయకూడని పనులను తెలియజేస్తుంది.
సెక్షన్– 171(బీ)
డబ్బుల పంపిణీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లు , అధికారులకు లంచం రూపంలో డబ్బులు ఇచ్చి ప్రలోభపెట్టాలని చూస్తే కేసు నమోదు చేయవచ్చు.
సెక్షన్–171(సీ)
స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం ఉన్న చోట ఒత్తిడి తీసుకొచ్చినా, ఓటర్లను బెదిరించినా, ఇతరులకు ఓటు వేస్తే దేవుడు శాపం పెడతాడంటూ చెప్పినా చట్టప్రకారం చర్యలు తీసుకునే వీలుంటుంది.
సెక్షన్–171(డీ)
ఎన్నికలలో పోటీ చేసే వ్యక్తులు ఓటర్లను ప్రాంతీయ కులం, మతంవారీగా వేరు చేసి ప్రలోభపెట్టేలా హామీలు ఇవ్వడం, అభివృద్ధి పనులు చేయడం, వ్యక్తిత్వం, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం నేరంగా పరిగణిస్తారు.
సెక్షన్–171 (ఈ)
ఎన్నికల సందర్భంగా ఓటర్లకు సామూహిక అన్నదానాలు నిర్వహించడం, మద్యంలాంటి పానియాలు అందించడం, వినోద కార్యక్రమాలు ఏర్పాట చేయడం ఈ నిబంధన కిందికి వస్తాయి.
సెక్షన్–171 (ఎఫ్)
అభ్యర్థులు తమకు కేటాయించిన దాని కన్నా ఎక్కువగా సమయం తీసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా మైకులు వాడడం, ప్రచార సామగ్రి వినియోగం, వార్తలు, ప్రకటనలు ఈ నిబంధనల కిందికి వస్తాయి.
సెక్షన్–171 (జీ)
అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసేలా తప్పుడు ప్రకటనలు చేయడం నిబంధనలకు విరుద్ధమవుతుంది.
సెక్షన్–171 (హెచ్)
అక్రమ చెల్లింపులు, నగదు పంపిణీ ఈ సెక్షన్ ప్రకారం నేరమవుతుంది.
సెక్షన్–171 (ఐ)
ఎన్నికల ఖర్చుకు సంబంధించిన ఖాతాలను ఏర్పాటు చేసి ఎన్నికలు ముగిసిన నెలలోగా ఖర్చుకు సంబంధించిన వివరాలు ఈసీకి సమర్పించడంలో విఫలం చెందితే ఈ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment