
హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల సమస్య పరిష్కారమయ్యే వరకూ స్థానిక సంస్థల ఎన్నికల్ని వాయిదా వేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 22% నుంచి 34% వరకు పెంచిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. బీసీ భవన్‌లో శనివారం చెరుకుల రాజేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం బీసీ రిజర్వేషన్లు లెక్కించడంలో అన్యాయం చేస్తున్నారని, దీనిపై అధికార పార్టీలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు నోరుమెదపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా బీసీ రిజర్వేషన్లు యథాతథంగా అమలు జరపొచ్చని, దీనిపై సీఎం అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితో చర్చలు జరిపాలని కోరారు. సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ పాల్గొన్నారు.