అక్కడే బాగుందట..! | Employees of different departments dipyutesan | Sakshi
Sakshi News home page

అక్కడే బాగుందట..!

Published Fri, Sep 12 2014 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:13 PM

Employees of different departments dipyutesan

 ‘‘పొరుగింటి పుల్లకూర రుచిగా ఉంటుందనే’’ సామెతను జిల్లాపరిషత్ ఉద్యోగుల్లో కొందరు బాగానే వంట పట్టించుకున్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని ఇతర శాఖల్లోకి... తమకు అనువైన ప్రాంతాలకు వెళుతున్నారు. దీంతో జెడ్పీలో డిప్యుటేషన్ల లొల్లితో పాలన వ్యవస్థ గాడితప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
 
 నీలగిరి : సొంత శాఖలో పనిచేయడమంటే వారికి అయిష్టం.. పొరుగు శాఖల్లో పనిచేస్తూ సొంత వ్యాపకాల్లో మునిగితేలడం వారికి ఎంతో ఇష్టం. రాజకీయ అండదండలున్న ఉద్యోగులు అయితే వారి మాటకు ఎదురుండదు.. జిల్లా అధికారులు సైతం వారి ఆదేశాలకు తలొగ్గాల్సిందే. మండలాల్లో  పనిచేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ఎంపీడీఓలు డిప్యుటేషన్‌ను అడ్డంపెట్టుకుని పొరుగుశాఖలవైపు తొంగిచూస్తున్నారు. ఇదే బాటలో సూపరింటెండెంట్లు, రికార్డు అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు పయనిస్తున్నారు. జిల్లా పరిషత్ ఉద్యోగులకు డిప్యుటేషన్‌పై ఇతర శాఖలో పనిచేసేందుకు పదేళ్ల పాటు అవకాశం ఉంది.
 
 అయితే దీనినే అదునుగా భావించిన కొందరు ఉద్యోగులు వివిధ శాఖలకు డిప్యుటేషన్‌పై వెళ్లడంతో సొంత శాఖలో పరిపాలన పూర్తిగా గాడితప్పింది. పదుల సంఖ్యలో ఉద్యోగులు సొంత శాఖను వదిలి పొరుగు శాఖల్లో పనిచేస్తున్నారు. మండల స్థాయి నుంచి జిల్లా పరిషత్ వరకు ఇదే పరిస్థితి  ఉంది. జిల్లా కేంద్రంలోనే ఉంటూ జెడ్పీలో పనిచేయడం ఇష్టంలేని ఉద్యోగులకు డీఆర్‌డీఏ, డ్వామా వంటి శాఖలు పునరావాస కేంద్రాలుగా మారాయి. ఈ విధంగా సొంత శాఖను కాదని వెళ్లిన ఉద్యోగులు ప్రభుత్వ సేవలను పక్కన పెట్టి వ్యక్తిగత అవసరాల పట్ల అమితాసక్తి చూపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పరిషత్ అధికారులపై మితిమీరిన రాజకీయ జోక్యం కారణంగానే ఇదంతా జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి..
 
 హైదరాబాద్‌లో సెటిలైన ఎంపీడీఓలు...
 జిల్లాలో ప్రస్తుతం 8ఎంపీడీఓ పోస్టులు  ఖాళీగా ఉన్నాయి. ఆయా మండలాల్లో పనిచేయాల్సిన వారు డిప్యుటేషన్లపై వేర్వేరు శాఖల్లో కొనసాగుతున్నారు. హైదరాబాద్ శివారు మండలాలైన చింతపల్లి, డిండి, చందంపేటలలో పనిచేయాల్సిన ఎంపీడీఓలు నగరంలో సెటిలయ్యారు. వీరితో పాటు నూతనకల్, మునుగోడు ఎంపీడీఓలు కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో  సేవలందిస్తున్నారు. నాంపల్లి ఎంపీడీఓ డ్వామా ఏపీడీగా పనిచేస్తున్నారు.
 
 అనుమల ఎంపీడీఓ డ్వామా ఏఓగా వెళ్లినట్లు జెడ్పీ అధికారులు వద్ద సమాచారం ఉంది. కానీ ఆమె సూర్యాపేట క్లస్టర్ ఏపీడీగా పనిచేస్తున్నారు. నిడమనూరు ఎంపీడీఓ పశ్చిమ గోదావరి జిల్లా డ్వామా కార్యాలయానికి వెళ్లారు. దీంతో ఆయా మండలాల్లో ఎంపీడీఓల పోస్టులు ఖాళీగా ఉండటంతో కింది స్థాయి ఉద్యోగులను ఇన్‌చార్జ్‌లుగా నియమించాల్సి వస్తోంది. ఇన్‌చార్జ్ పోస్టుల్లో స్థానం సంపాదించేందుకు ఉద్యోగులు తీవ్రంగా పోటీ పడుతున్నా రు. నాంపల్లి ఎంపీడీఓ స్థానం కోసం అక్కడ పనిచేసే సూపరింటెండెంట్ రాజకీయ పైరవీలు ప్రారంభించినట్లు సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement