ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్, కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి ఏపీ సావ్నీ. చిత్రంలో కేంద్ర మంత్రి రవిశంకర్, మోహిత్ తుక్రాల్
సాక్షి, హైదరాబాద్: కొత్త టెక్నాలజీ వల్ల ప్రస్తుత ఉద్యోగాల్లో పదింటికి కోత పడినా వంద కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. దేశంలో ఫేస్‌బుక్, వాట్సాప్, ట్వీటర్‌ల వాడకం పెరుగుతుండ టంతో అనేక అంతర్జాతీయ డిజిటల్ టెక్నా లజీ కంపెనీలు భారత్‌లో అడుగుపెడుతున్నాయన్నారు. వరల్డ్ ఐటీ కాంగ్రెస్–2018కు హాజరవడానికి సోమవారం హైదరాబాద్ వచ్చిన మంత్రి విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా కార్యక్రమం సామాన్యునికి కూడా ఆధునిక టెక్నా లజీ ఫలాలు అందిస్తోందని చెప్పారు. మరో ఐదేళ్లలో దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను రూ.లక్ష కోట్ల స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కొత్త టెక్నాలజీల వల్ల ఐటీ ఉద్యోగాలు పోతున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు, కొత్త ఉద్యోగాలకు సన్నద్ధం చేసేందుకు నాస్కామ్, ఐటీ కంపెనీలు ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్‌ఫాం సిద్ధం చేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. సమాచార రక్షణ బిల్లు గురించి మాట్లాడుతూ.. జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని కమిటీ బిల్లు సిద్ధం చేస్తోందని, అవినీతిపరులు, టెర్రరిస్టులకు ప్రైవసీ వర్తించదని స్పష్టం చేశారు.
40 లక్షల మందికి కొత్త నైపుణ్యాలు..
ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్‌ఫాం ఏర్పాటుకు సంబంధించి మంత్రి సమక్షంలో నాస్కామ్, కేంద్ర ఐటీ శాఖ అవగాహన పత్రం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఫ్యూచర్ స్కిల్స్ ప్లాట్ ఫాం ద్వారా వచ్చే మూడు నాలుగేళ్లలో 40 లక్షల మందికి కొత్త నైపుణ్యాలు, టెక్నాలజీలపై శిక్షణిస్తామని నాస్కామ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలిపారు. కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ, బిగ్ డేటా అనలటిక్స్ వంటి 8 కొత్త టెక్నాలజీలు.. 55 కొత్తతరం ఉద్యోగాల శిక్షణ, సర్టిఫికేషన్ ఫ్యూచర్ స్కిల్స్ ద్వారా అందిస్తామన్నారు. సిలికాన్ వ్యాలీ సంస్థ ఎడ్‌కాస్ట్ భాగస్వామ్యంతో ప్లాట్‌ఫాం నిర్మాణం జరిగిందని.. ఎడక్స్, రెడ్‌హ్యాట్, హ్యాకర్ ర్యాంక్, ఎడ్జ్ నెట్‌వర్క్స్ వంటి సంస్థలు వేర్వేరు హోదాల్లో సహకరిస్తున్నాయని వివరించారు. కంపెనీల అవసరాలు, ఉద్యోగుల అర్హతల ఆధారంగా శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని, ఇందుకు కంపెనీలు నామమాత్రపు ఫీజు వసూలు చేస్తాయని ప్లాట్‌ఫాం అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన మోహిత్ టుక్రాల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment