కొత్త కొలువుల జూమ్‌ | New jobs zoom | Sakshi
Sakshi News home page

కొత్త కొలువుల జూమ్‌

Published Thu, Nov 2 2017 3:40 AM | Last Updated on Thu, Nov 2 2017 9:52 AM

New jobs zoom - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైటెక్‌ నగరంలో కొత్త కొలువుల ‘జూమ్‌’ అంటున్నాయి. యువత ఆ కొలువుల వైపు పరిగెడుతోంది. ఆశించిన స్థాయిలో ఐటీ జాబ్స్‌ పెరగకపోయినా... సేవా, నిర్మాణ, ఇంజనీరింగ్, సేల్స్, మార్కెటింగ్‌ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు కొత్త ఉత్సాహాన్నిస్తున్నాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, సేవా రంగాల్లో శరవేగంగా విస్తరిస్తోన్న గ్రేటర్‌ నగరంలో కొత్త కొలువులు నిరుద్యోగులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పలు మెట్రో నగరాల్లో ఇదే పరిస్థితి ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడవడం విశేషం. ప్రముఖ కొలువుల వెబ్‌సైట్‌ నౌకరిడాట్‌కామ్‌ తాజా అధ్యయనంలో ఈ విషయం తేలింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, హైదరాబాద్‌ తదితర మెట్రో నగరాల్లో పలు రంగాలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెలుగుచూశాయి. ఆయా సిటీల్లో ప్రధానంగా బ్యాంకులు, ఆర్థిక, ఇన్సూరెన్స్‌ తదితర సంస్థల్లో ఉపాధి కల్పన, ఉద్యోగాల వృద్ధిరేటు 21 శాతం మేర నమోదవగా.. ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో 4 శాతం వృద్ధిరేటు తగ్గినట్లు తేలింది. ఇక ఐటీ అనుబంధ రంగాలు, బీపీఓ విభాగంలో 8 శాతం వృద్ధిరేటు తగ్గడం గమనార్హం.  

గ్రేటర్‌ స్థానం 4
విశ్వనగరం బాటలో దూసుకుపోతున్న గ్రేటర్‌ నగరంలో సేవారంగం శరవేగంగా విస్తరిస్తోంది. ప్రధానంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, బ్యాంకింగేతర సంస్థలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, భారీ యంత్ర పరికరాలు, నిర్మాణ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఇక ఇంజనీరింగ్, ఆటోమొబైల్స్, సేల్స్, మార్కెటింగ్, వాణిజ్య ప్రకటనలు(అడ్వర్టైజింగ్‌) రంగాలు కూడా ఇటీవలి కాలంలో ఇతోధికంగా పురోగమిస్తున్నాయి. గ్రేటర్‌లో మొత్తంగా ఈ రంగాల్లో సగటున ఏటా 6 శాతం మేర ఉపాధి అవకాశాలు పెరుగుతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో బెంగళూరు నగరం 16 శాతం వృద్ధిరేటుతో తొలిస్థానంలో ఉంది. ఇక రెండోస్థానంలో నిలిచిన ముంబై, కోల్‌కతా మహానగరాల్లో 15 శాతం వృద్ధి నమోదైంది. మూడో స్థానంలో నిలిచిన చెన్నైలో 9 శాతం.. నాలుగోస్థానంలో నిలిచిన హైదరాబాద్‌లో 6 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు వెల్లడైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఆయా రంగాల్లో సగటున 9 శాతం తరుగుదల నమోదైనట్లు తేలింది. 

గ్రేటర్‌లో ఆయా రంగాల పరిస్థితి ఇదీ
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు: గ్రేటర్‌ కేంద్రంగా దేశ, విదేశాలకు చెందిన పలు ఆర్థిక, వాణిజ్య, బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ కార్యకలాపాలను క్రమంగా విస్తరిస్తున్నాయి. ప్రధానంగా ఇన్సూరెన్స్, పెట్టుబడుల రంగం పురోగమిస్తోంది. వేలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది.

భారీ యంత్ర పరికరాలు: గ్రేటర్‌లో పారిశ్రామికీకరణ ప్రక్రియ వేగవంతం కావడంతో భారీ యంత్ర పరికరాల పరిశ్రమలు వేగంగా విస్తరిస్తున్నాయి. టీఎస్‌ ఐపాస్‌తో పరిశ్రమలకు ఏకగవాక్ష అనుమతులు మంజూరు చేస్తుండటంతో పరిశ్రమల సంఖ్య పెరుగుతోంది.

ఆటోమొబైల్స్‌: గ్రేటర్‌ జనాభా కోటి కాగా... వాహనాల సంఖ్య సుమారు 50 లక్షలు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి వాహనం ఉందన్నమాట. ఈ నేపథ్యంలో నూతన వాహనాల కొనుగోలు, వాటి నిర్వహణ, మరమ్మతులకు సంబంధించిన ఆటోమొబైల్‌ రంగం వృద్ధి చెందడమే కాదు.. పలువురికి ఉపాధి బాట చూపుతోంది.

ఇంజనీరింగ్‌: మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్‌ సంబంధిత పరిశ్రమలు, ఇన్‌ఫ్రా కంపెనీలకు నగరం చిరునామాగా మారడంతో ఈ రంగాల్లో ఇటీవలికాలంలో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి.

నిర్మాణ రంగం: గ్రేటర్‌ శివార్లలో విద్య, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు విస్తరించడంతో ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందినవారు నగరానికి వలసవస్తున్నారు. వీరికి గృహ వసతి అత్యవసరంగా మారింది. శివార్లలో అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలు, వేతన జీవులు స్వతంత్ర గృహాల కొనుగోలుకు ప్రాధాన్యతనిస్తుండటంతో నిర్మాణ రంగం పుంజుకుంటోంది.

సేల్స్‌: కాదేది అమ్మకానికి అనర్హం.. పిజ్జా, బర్గర్‌ మొదలు.. కాళ్లకు వేసుకునే షూజ్, సాక్సులు, గృహోపకరణాలు, అలంకరణ వస్తువులకు రోజురోజుకూ డిమాండ్‌ పెరుగుతోంది. ఇంటి వద్దకే కావాల్సిన వస్తువులు అందించే సేల్స్‌ రిప్రజెంటేటివ్‌లకు పలు సంస్థలు భారీగా కొలువులు, వేతనాలు, కమీషన్లు ఆఫర్‌ చేస్తుండటం విశేషం.

మార్కెటింగ్, వాణిజ్య ప్రకటనలు: ఇక వివిధ వస్తువులు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, నిర్మాణ రంగ సంస్థల్లో మార్కెటింగ్‌ చేసేవారికి కొత్త కొలువులు స్వాగతం పలుకుతూనే ఉన్నాయి. ఇక దేశ, విదేశాలకు చెందిన మల్టీబ్రాండెడ్‌ వస్తువులకు వాణిజ్య ప్రకటనలు తప్పనిసరి అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రకటనల రంగం శరవేగంగా విస్తరిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement