నగర శివార్లలో దిశ నిందితులు హతమైన నేపథ్యంలో సిటీ పరిధిలో గతంలోజరిగిన ఎన్‌కౌంటర్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలో తుపాకీ మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. టెర్రరిస్టులు, దోపిడీ దొంగలు పోలీసుల చేతిలో హతమయ్యారు.
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగర శివార్లలో శుక్రవారం జరిగిన ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్ సంచలనం సృష్టించింది. ఇదొక్కటే కాదు.. గత కొన్ని దశాబ్ధాలుగా రాజధానిలో తుపాకీ మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదులు, అసాంఘికశక్తులు పోలీసుల చేతిలో హతమౌతున్నారు. నగరానికి చెందిన ముష్కరులు కొందరు ఇతర ప్రాంతాలు, దేశాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు.
నగరంలో జరిగిన ఎన్‌కౌంటర్లు ఇవీ..
♦ ఇంటెలిజెన్స్ విభాగం అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్, ఆయన గన్‌మ్యాన్ వెంకటేశ్వర్లును హిజ్‌బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు 1992 నవంబర్ 29న హత్య చేశారు. టోలిచౌకి పరిధిలోని బృందావన్ కాలనీలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న లయాఖ్ అలీని సిట్ పోలీసులు అదే ఏడాది డిసెంబర్ 11న నగర శివార్లలో జరిగిన ఎదురు కాల్పుల్లో మట్టుబెట్టారు.
♦ నల్లగొండ జిల్లాకు చెందిన మీర్ మహ్మద్ అలీ, మహ్మద్ ఫసీయుద్దీన్ కరసేవకులైన నందరాజ్‌గౌడ్, పాపయ్య గౌడ్‌లను హతమార్చిన కేసులో నిందితులుగా ఉన్నారు. ఫసీ మాడ్యుల్‌కు చెందిన ఈ ఉగ్రవాదులు 1993 జూన్ 21న కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు.
♦ దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా దేవాలయం వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ బారీ మాడ్యుల్‌కు చెందిన ఉగ్రవాది మహ్మద్ ఆజం ఆదే ఏడాది ఉప్పల్‌లో, మరో నిందితుడు సయ్యద్ అబ్దుల్ అజీజ్ సరూర్‌నగర్‌లో ఎన్‌కౌంటర్ అయ్యారు.
♦ నేరేడ్‌మెట్ రౌడీషీటర్ వేణు, బస్ డెకాయిటీ గ్యాంగ్ లీడర్ కొక్కుల రాజు, గుంటూరుకు చెందిన కిడ్నాపర్ కామేశ్వరావు, గ్యాంగ్ స్టర్ అజీజ్‌రెడ్డి, కిడ్నాపర్ గౌరు సురేష్.. ఇలా పలువురు అసాంఘిక శక్తులు నగరంలో ఎన్‌కౌంటర్ అయ్యారు.
♦ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ ప్రాంతంలో 2016లో జరిగిన ఎదురు కాల్పుల్లో చైన్ స్నాచర్ శివ చనిపోయాడు. శుక్రవారం షాద్‌నగర్ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ‘దిశ’ నిందితులు హతమయ్యారు.
‘బయట’ హతమైన నగర ముష్కరులు...
♦ కరసేవకులైన నందరాజ్‌గౌడ్, పాపయ్య గౌడ్‌లను ఫసీ మాడ్యుల్ 1993లో హత్య చేసింది. ఈ మాడ్యుల్ దీంతో పాటు మరికొన్ని ఘోరాలకు పాల్పడింది. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న మీర్జా ఫయాజ్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఇతడు నగరంలోని మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన వ్యక్తి.
♦ వరంగల్‌కు చెందిన ఆజం ఘోరీ కూడా ఉగ్రవాద బాటపట్టాడు. హైదరాబాద్‌లో ఉంటూ తన కార్యకలాపాలు సాగించడంతో పాటు సొంతంగా ఓ గ్యాంగ్ (మాడ్యుల్) తయారు చేసుకున్నాడు. అనేక కేసుల్లో వాటెండ్‌గా మారడంతో ఇక్కడి పోలీసుల నిఘా, గాలింపు పెరగడంతో జగిత్యాలకు మకాం మార్చాడు. 2000 ఏప్రిల్ 6న అక్కడ జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
♦ నల్లగొండ జిల్లా అభియ కాలనీకి చెందిన గులాం యజ్దానీ ఆజం ఘోరీ మాడ్యుల్‌లో కీలకంగా వ్యవహరిస్తూ నగరం కేంద్రంగానే తన కార్యకలాపాలు సాగించాడు. ఇతడి గ్యాంగ్ హైదరాబాద్‌తో పాటు విజయవాడ, బోధన్, నిజామాబాద్, మెట్‌పల్లి తదితర ప్రాంతాల్లో పంజా విసిరింది. ఇతను 2006లో ఢిల్లీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
♦ నగరంలో జరిగిన అనేక ఉగ్రవాద ఘటనలకు సూత్రధారిగా ఉండి సుదీర్ఘకాలం పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఉగ్రవాది బిలాల్, అతడి సోదరుడు సమద్‌లు 2008లో లాహోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ లో హతమయ్యారు.
♦ తెహరీఖ్ గల్బా ఏ ఇస్లాం (టీజీఐ) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి అనేక దోపిడీలకు, బందిపోటు దొంగతనాలు, హత్యలకు పాల్పడిన వికారుద్దీన్ గ్యాంగ్ 2015లో ఆలేరు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైంది. ఈ ముఠా సభ్యులందరూ సిటీకి చెందిన వారే కావడం గమనార్హం.
♦ నల్లగొండ జిల్లా నుంచి నగరం మీదుగా రాష్ట్రం మొత్తం నెట్‌వర్క్ విస్తరించుకుని, దేశంలోని అనేక చోట్ల డెన్లు ఏర్పాటు చేసుకున్న గ్యాంగ్‌స్టర్ నయీం 2016లో షాద్‌నగర్ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్ లో హతమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment