నెలాఖరు వరకు ‘స్మైల్-2’
* మెదక్ డివిజన్‌లో ఇప్పటివరకు 23 మంది బాలకార్మికుల గుర్తింపు
* జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న 8 బృందాలు
* తాజాగా అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, తూప్రాన్‌లో దాడులు : 17 మంది గుర్తింపు
* స్మైల్-2 ప్రత్యేక అధికారి హన్మంత్ నాయక్ వెల్లడి
అల్లాదుర్గం: జిల్లాలో ఈనెల ఒకటో తేదీన ప్రారంభించిన ‘ఆపరేషన్ స్మైల్-2’ కార్యక్రమాన్ని ఈనెల 31వ తేదీ వరకు నిర్వహిస్తామని ఆపరేషన్ స్మైల్-2 ప్రత్యేక అధికారి హన్మంత్ నాయక్ తెలిపారు. మంగళవారం పెద్దశంకరంపేట, అల్లాదుర్గంలో తనిఖీలు నిర్వహించి ఎనిమిది మంది బాల కార్మికులను గుర్తించినట్టు చెప్పారు. సీఐడీ, సీడబ్ల్యూసీ, బాలల సంరక్షణ అధికారుల భాగస్వామ్యంతో స్మైల్-2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
ఇందులో భాగంగా జిల్లాలో ఎనిమిది బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నామన్నారు. ఇప్పటివరకు మెదక్ డివిజన్ పరిధిలో 23 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిని దొంతి, సంగారెడ్డి, నిజాంపేట, మెదక్‌లోని బాలల సంరక్షణ కేంద్రాల్లో చేర్పిస్తున్నట్టు చెప్పారు. బాలలను అదుపులోకి తీసుకునే సమయంలో ఎదిరించిన తల్లిదండ్రులు, యజమానులపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
ఒక్క రోజులోనే 17 మంది గుర్తింపు
అల్లాదుర్గం/తూప్రాన్: ‘ఆపరేషన్ స్మైల్-2’లో భాగంగా మంగళవారం పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, తూప్రాన్‌లో తనిఖీలు నిర్వహించారు. పెద్దశంకరంపేట, అల్లాదుర్గంలో నలుగురు చొప్పున అదుపులోకి తీసుకున్నట్టు బాలల సంరక్షణ అధికారి రామకృష్ణ తెలిపారు. కాగా తూప్రాన్‌లోని వివిధ దుకాణాల్లో దాడులు చేసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఆ ప్రాంత బాలల సంరక్షణ అధికారి భాస్కర్‌గౌడ్ తెలిపారు.