
ఇంజనీరింగ్ విద్యకు పెద్దపీట
- డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
- అరోరాలో ముగిసిన నేషనల్ ఫెస్ట్
చాంద్రాయణగుట్ట: తెలంగాణలో ఇంజనీరింగ్ విద్యాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పేర్కొన్నారు. బండ్లగూడలోని అరోరా సైంటిఫిక్, టెక్నాలాజికల్ అండ్ రీసెర్చ్ అకాడమీలో రెండు రోజుల పాటు కొనసాగిన ‘ఉద్భవ్’ జాతీయ స్థాయి ఫెస్ట్ శనివారం ముగిసింది. ఈ సందర్భంగా హాజరైన డిప్యూటీ సీఎం మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నతస్థానాలకు ఎదగాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులకు కూడా నిధులు మంజూరు చేశామని చెప్పారు.
అనంతరం ఆయన పేపర్, పోస్టర్ ప్రజెంటేషన్, ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్, వెబ్ డిజైనింగ్, రోబోటిక్స్, సర్క్యూట్ మేకింగ్, కోడింగ్ మానియా, ల్యాన్ గేమింగ్, రివర్స్ ఇంజనీరింగ్, బెస్ట్ ఫ్రమ్ వేస్ట్ తదితర అంశాలపై విద్యార్థులు రూపొందించిన నమూనాలను పరిశీలించారు. అనంతరం కళాశాల డెరైక్టర్ శ్రీలత మాట్లాడారు. ఉత్తమ నమూనాలకు నగదు పురస్కారాలు అందించారు. విద్యార్థులకు స్లో బైక్ రేసింగ్ పోటీలు నిర్వహించారు.
ఇందులో కాలు కింద పెట్టకుండా కనిష్ట వేగంతో వెళ్లిన వారికి 10 వేల నగదు పురస్కారాన్ని అందించారు. ఈ ఫెస్ట్‌లో మొత్తం 162 కళాశాలల విద్యార్థులు పాల్గొనగా 200కు పైగా నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అంతకుముందు అరోరా కళాశాలల గ్రూప్ చైర్మన్ రాజబాబు, సెక్రటరీ రమేష్ బాబు, ఐఈఈఐ చీఫ్ ఇంజనీర్ ఐ.ఎస్.రాజు తదితరులు ప్రసంగించారు.