ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
సాక్షి, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిన రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ మండలం మర్రిపల్లి శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టడంతో కారు నడుపుతున్న బీటెక్ విద్యార్థి రాజేష్ అక్కడికక్కడే చనిపోగా, మరో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇదిలా ఉండగా.. పెద్దపల్లి జిల్లా రామగుండం జీరో పాయింట్ వద్ద ఓ ద్విచక్రవాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పైప్‌లైన్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న వంగ అజయ్, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, ఇంకొకరికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.