పంటలకు గిట్టుబాటు ధర కల్పించరా?
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎల్.రమణ, ఎర్రబెల్లి
హైదరాబాద్: వర్షాభావం ఒకవైపు, కరెంటు కోత మరోవైపుతో అష్టకష్టాలు పడి రైతులు పండించిన కొద్దిపాటి పంటకైనా ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేకపోతోందని, సీసీఐ, మార్క్‌ఫెడ్‌ల ద్వారా పత్తి, మొక్కజొన్న, ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు చేయిస్తానని కరపత్రాలు పంచిన మంత్రి హరీష్‌రావుకు వాస్తవ పరిస్థితి తెలియడం లేదని తెలంగాణ తెలుగుదేశం పార్టీ విమర్శించింది. బుధవారం టీడీపీ కార్యాలయంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ వైఫల్యం వల్ల కరెంటు, సాగునీరు లేక అధిక శాతం పంటలు ఎండిపోయాయని, మిగిలిన పంటలను అమ్ముకుందామన్నా రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయని వారు విమర్శించారు.
పేదల తరఫున ఉద్యమిస్తాం: ఎర్రబెల్లి
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు మెడలు వంచైనా అర్హులైన పేదలకు రేషన్‌కార్డులు, పింఛన్లు ఇప్పిస్తామని టీటీడీపీ శాసన సభాపక్ష నేత ఎర్రబెల్లి అన్నారు. పింఛన్ల కోత, రేషన్‌కార్డుల ఏరివేతను నిరసిస్తూ జూబ్లీహిల్స్ నియోజక వర్గం టీడీపీ బుధవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 3లోని ఖైరతాబాద్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు.