మెదక్ (పాపన్నపేట): మార్కెట్ కమిటీ ఏర్పాటుతో రైతులకు భరోసా లభిస్తుందని టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మెదక్‌జిల్లా పాపన్నపేట మండలంలో మార్కెట్ కమిటీ కార్యాలయాలు, గోదాములు నిర్మించడానికి అవసరమైన స్థలాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మెదక్ జిల్లాలో వరి, చెరకు పంటలు అత్యధికంగా పండించే మండలాల్లో పాపన్నపేట ఒకటి అని ఆయన తెలిపారు. స్థానికంగా మార్కెట్ కమిటీ లేకపోవడంతో రైతులు తాము పండించిన పంటను నిల్వ ఉంచుకునే అవకాశం లేక పొలంలోనే ధాన్యాన్ని తూకం చేసే వారన్నారు.
ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి, మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే మార్కెట్ కమిటీ మంజూరు చేస్తూ మంత్రి హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన తెలిపారు. పాపన్నపేటలో మహిళా జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవెందర్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అందుకు అనువైన స్ధలాన్ని ఇచ్చేందుకు దాతలు గాని, ప్రభుత్వ భూమి గాని సిద్ధంగా ఉండేలా చూడాలని స్ధానిక నాయకులకు సూచించారు.
పాపన్నపేట ఏపీజీవీ బ్యాంకులో సరైన సేవలందక వినియోగదారులు, రైతులు, ఉపాధి కూలీలు, డ్వాక్రా గ్రూపు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్ధులు తెలిపారు. ఈ విషయాన్ని డిప్యూటీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళి బ్యాంకు స్థాయి పెంచేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే ఎస్‌బిహెచ్ శాఖ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
మార్కెట్ కమిటీతో రైతులకు భరోసా
Published Thu, Jun 11 2015 6:11 PM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM
Advertisement
Advertisement