- రెండు పంటలు పోయినా చలించని కేసీఆర్
- టీడీఎల్పీ ఫ్లోర్‌లీడర్ ఎర్రబెల్లి
వరంగల్ : పంట నష్టపోయిన రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో రికార్డులకు ఎక్కిందని, అయినా సీఎం కేసీఆర్ చలించడం లేదని టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. హన్మకొండ రాంనగర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన కుటుంబం ధనికమైనంత మాత్రాన రైతులంతా ధనికులని భావించడం సీఎం కేసీఆర్ తప్పిదమన్నారు.రైతులకు ప్రకటించిన రుణమాఫీపై ఇప్పటికి స్పష్టత లేదన్నారు.
గత సీజన్‌లో రూ.5500 అమ్మిన పత్తి ఈ సీజన్‌లో 3600 మించలేదన్నారు. తెలంగా ణ వస్తే పంటలకు గిట్టుబాటు ధర వస్తుందని భావించిన రైతులకు నిరాశే మిగలిందన్నారు. తెలంగాణలోని అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించి, నష్ట పరిహారం అందించాలన్నారు. జిల్లాల్లో నెలకొన్న కరువు పరిస్థితులను తెలుసుకునేందుకు టీడీపీ ప్రతి నిధుల బృందం జిల్లాల్లో పర్యటిస్తోందన్నారు. గురువారం జిల్లాలోని శాయంపేట మండలంలోని గ్రామాలను సందర్శిస్తామన్నారు.
మిషన్ కరప్షన్ కాకతీయగా మారింది: సీతక్క
చెరువుల పునరుద్ధరణ కోసం ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కరప్షన్‌గా మారిందని మాజీ ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. పనులు పొందిన కాంట్రాక్టర్లను అధికార పార్టీ నేతలు బెదిరించి తమ అనుయాయులకు కట్టబెట్టారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళీమనోహర్, దొమ్మాటి సాంబయ్య, పుల్లూరు అశోక్ , ఈశ్వర్, మార్గం సారంగం, సంతోష్‌నాయక్ పాల్గొన్నారు.