సాక్షి, హైదరాబాద్: కరోనా టెస్టులు, మరణాలపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పచ్చి అబద్దాలతో తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారని వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఒక జాతీయ నాయకుడై ఉండి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం చిల్లర రాజకీయానికి నిదర్శనమని అన్నారు. ఢిల్లీ స్థాయి నాయకుడు గల్లీ మాటలు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఈటల మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీతో పాటు కేంద్రం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు.
ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రాంతీయ పార్టీలపై బీజేపీ ఆరోపణలు చేసే ముందు ఆ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పనితీరు ఎలా ఉందో తెలుసుకుని మాట్లాడాలని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దని హితవు పలికారు. తెలంగాణలో పాజిటివ్ కేసులు మొదలు కాకముందే కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. కరోనా విషయంలో రాజకీయాలు చేయకుండా కేంద్రానికి, ప్రధానికి మద్దతుగా నిలిచిన మొదటి రాష్ట్రం తెలంగాణ, సీఎంకేసీఆర్ అని అన్నారు. ఢిల్లీలో పార్లమెంట్‌కి కూతవేటు దూరంలో ‘మర్కజ్’కేసులు వచ్చినా కేంద్రం బయట పెట్టలేదని, దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనన్నారు.
పేదలను కాపాడాలనే ఆలోచన లేదు
బీజేపీకి రాజకీయాలు తప్ప పేదల ప్రాణాలు కాపాడే ఆలోచనే లేదని ఈటల విమర్శించారు. కేంద్రం నుంచి 2 లక్షల ఎన్95 మాస్కులు, బిక్ష మాదిరిగా పీపీఈ కిట్లు మాత్రమే ఇచ్చారని ధ్వజమెత్తారు. తెలంగాణకు రావాల్సిన టెస్టుల యంత్రాలు కోల్‌కతాకు తరలించారని ఆరోపించారు. కరోనా కట్టడిలో సఫలమైన రాష్ట్రం తెలంగాణ అని.. కేరళ, తమిళనాడు తర్వాత రాష్ట్రం వైద్య రంగంలో దూసుకుపోతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment