7 గంటలకు ఎసరు
ఖరీఫ్‌కు ప్రారంభంలోనే జిల్లాలో ఎడాపెడా విద్యుత్‌కోతలు మొదలయ్యాయి. వ్యవసాయానికి ఏడుగంటలపాటు త్రీఫేజ్ కరెంట్‌ను సరఫరా చేయాల్సిన అధికారులు గంట తగ్గించారు. వర్షాలు కురియకపోవడంతో జలవిద్యుదుత్పత్తి నిలిచిపోయిందన్న కారణంతో విద్యుత్తుశాఖ కోతలకు శ్రీకారం చుట్టింది. దీంతో క రిగేట్లను సిద్ధంచేసుకుని.. నాట్ల వేసేందుకు పూనుకుంటున్న రైతన్నలు దిక్కుతోచనిస్థితిలో పడ్డారు.
పాలమూరు: ట్రాన్స్‌కో అధికారులు కరెంట్‌కోతలను పకడ్బందీగా అమలుచేస్తున్నారు. జిల్లా కేంద్రంలో గృహావసరాలకోసం రోజులో గంటపాటు విద్యుత్తు కోత విధిస్తున్నట్లు చెబుతున్నా.. అంతకు రెట్టింపు సమయం విద్యుత్‌కోతను అమలుచేస్తున్నారు. పట్టణాలు, మండల కేంద్రాలు, విద్యుత్ ఉపకేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో ఉదయం ఓ గంట, సాయంత్రం మరో గంట మొత్తం రెండుగంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నారు.
వీటిపరిధిలో నాలుగు గంటలకు పైగా అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. గ్రామీణప్రాంతాల్లో ఈ కోతల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఎప్పుడు కరెంట్ ఉంటుందో.. ఎప్పుడు తీస్తారో తెలియని అయోమయ పరిస్థితిలో జనం ఇబ్బంది పడాల్సి వస్తోంది. జిల్లా, పట్టణ, మండల, విద్యుత్తు ఉపకేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఈ అధికారిక కోతలకు అదనంగా అప్రకటిత కోతలు విధిస్తున్నారు.
ఖరీఫ్‌నాట్లకు సమాయత్తం
జిల్లాలో మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, ‘పేట’ డివిజన్ల పరిధిలో రైతులు ఖరీఫ్ వరినాట్లకు సిద్ధమయ్యారు. తుకాలు పోసుకుని నాట్లకు రెడీ అవుతున్నారు. ఎరువులను సమకూర్చుకుంటున్నారు. వేసవి ఎండల తీవ్రతకు కరెంట్ కోతలు తోడవడంతో రైతులకు దిక్కుతోచనిపరిస్థితి ఎదురవుతోంది. కరిగెట్లకు వట్టిపారిపోవడంతో మళ్లీ తడిపేందుకు రైతులను కరెంట్‌కోతలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏడు గంటలపాటు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయాల్సి ఉండగా.. అందులో గంట సమయాన్ని తగ్గించి, అదీ రెండు విడతలుగా అందిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఇచ్చే విద్యుత్‌ను ‘ఏ’, ‘బీ’, ‘సీ’ గ్రూపులుగా విభజించి సరఫరా చేస్తున్నారు. ‘ఏ’ గ్రూప్‌లో ఉదయం 4 నుంచి 8గంటల వరకు, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు, ‘బీ’ గ్రూప్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అర్ధరాత్రి 12 నుంచి 2 గంటల వరకు, ‘సీ’ గ్రూప్‌లో మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, రాత్రి 1 నుంచి ఉదయం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా చేయనున్నారు.
వర్షాలు కురియకపోవడంతో రైతులు ఇప్పటివరకు వ్యవసాయభూముల్లో విత్తనాలు వేసుకోలేదు. దీంతో, తమకు ప్రస్తుతం విద్యుత్ అవసరంలేదని, పంటలు వేసుకున్న తర్వాత ఏడుగంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అదీ పగటిపూట ఇవ్వాలని అధికారులను కోరుతున్నారు. జిల్లాలో అధికారిక కోతలను విధించినప్పటికీ.. అప్రకటిత విద్యుత్ కోతలను నిలువరించి, ఉష్ణతాపం నుంచి ఆదుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.