
బంగారు నగలపై ఎక్సైజ్ సుంకం తగదు
ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గత వారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బంగారు ఆభరణాలపై 1 శాతం సుంకం విధిస్తూ కేంద్రమంత్రి తీసుకున్న నిర్ణయం సరికాదని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం పార్లమెంట్ జీరోఅవర్‌లో ఈ విషయంపై ఎంపీ మాట్లాడుతూ రెవెన్యూ పెంచుకునేందుకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చిన్న, సన్నకారు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. ఈ నిర్ణయంతో బం గారు నగల వ్యాపారులు ఈనెల 2వ తేదీనుంచి దేశవ్యాప్త సమ్మెను కొనసాగిస్తున్నారని తెలిపారు.
ఒక శాతం ఎక్సైజ్ సుంకం పెంచడం వల్ల ఆభరణాల హబ్‌గా పేరు న్న హైదరాబాద్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని, ఇక్కడ 5 లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల దేశంలో ఈ రంగానికి ప్రతి రోజు రూ. 7 వేల కోట్ల నష్టం వాటిల్లుతోందన్నారు. 14రోజుల పాటు జరిగిన నిరవధిక సమ్మె వల్ల రూ. 98 వేల కోట్ల నష్టం వాటిల్లిందని వివరించారు. ప్రధాని స్వచ్ఛ భారత్, మేడిన్ ఇండియా అంటూ ముందుకు సాగుతుంటే.. కేంద్రం మాత్రం స్థాని కంగా తయారయ్యే బంగారు నగలపై ఎక్సైజ్ సుంకం విధిస్తోందని విమర్శించారు. గతంలోనూ ఆభరణాలపై ఎక్సైజ్ సుంకం విధిస్తే.. బంగారు వ్యాపారులు మూడు వారాలపాటు బంద్ నిర్వహించ డంతో కేంద్రం దాన్ని ఎత్తివేసిందని గుర్తుచేశారు. ఇప్పటికైనా నగల వ్యాపారులు, చేతివృత్తిదారుల స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని సుంకాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.