పట్టుకోగానే ‘గంట’ కొట్టాడు!
ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు ఏపీ మంత్రి ఫోన్
సాక్షి, హైదరాబాద్:
విదేశీ మద్యం బాటిళ్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు పట్టుబడ్డ అధికారులను వదలిపెట్టా లంటూ ఏపీకి చెందిన మంత్రి ఒకరు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలిసింది. ఈ అడ్డగోలు దందాలో పోలీసులకు చిక్కిన శంషాబాద్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ సూపరింటెండెంట్‌ను వదలిపెట్టాలని, అతడు తనకు మంచి మిత్రుడని చెబుతూ సదరు మంత్రి.. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌కు ఫోన్‌లో ‘గంట’కొట్టాడు. అయితే సబర్వాల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సూపరింటెండెంట్‌ను వదిలిపెట్టేది లేదని, అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయని ఆ అమాత్యుడికి స్పష్టంచేశారు. దీంతో చేసేదేమి లేక ఆ మంత్రి తెలంగాణలోని పలువురు ప్రముఖులతో అకున్ సబర్వాల్‌కు ఫోన్ల మీద ఫోన్లు చేయించినట్టు తెలుస్తోంది.
అరెస్టయిన కస్టమ్స్ అధికారులు అమాత్యుడికి సైతం ప్రతీనెల విదేశీ మద్యం బాటిళ్లను సరఫరా చేస్తారని ఎక్సైజ్ విచారణలో తేలినట్టు తెలుస్తోంది. అందుకే పదే పదే ఫోన్లు చేసి వారిని వదిలి వేయాలని ఒత్తిడి తెచ్చాడని అధికారులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పాస్‌పోర్టులను కొందరు కస్టమ్స్ అధికారులు స్కాన్ చేసి.. కస్టమ్స్ ఔట్‌లెట్ లిక్కర్‌ను పక్క దారిపట్టిస్తున్నారు. వారు బ్రోకర్లతో కలసి నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్‌లో బడాబాబులకు విదేశీ లిక్కర్ బాటిళ్లను అధిక ధరకు విక్రయిస్తున్నట్టు అకున్ సబర్వాల్ తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ఎక్సైజ్‌కు భారీగా నష్టం వస్తోందని, ప్రతీ ఏటా రూ.45 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు ఆయన చెప్పారు.