* పదిశాఖల పోస్టులు పంపిణీ చేస్తూ రేపు నోటిఫికేషన్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య రాష్ట్రస్థాయి పోస్టులు, ఉద్యోగుల పంపిణీపై కసరత్తును కమలనాథన్ కమిటీ ఓ కొలిక్కి తీసుకువచ్చింది. సెలవు రోజుల్లో కూడా ‘సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్’కు వెళ్లి మరీ సమాచారం రాబట్టడంతో పాటు, మార్గదర్శక సూత్రా ల ప్రకారం పోస్టులు, ఉద్యోగుల పంపిణీకి అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఈ ప్రక్రియను కమలనాథన్ కమిటీ, రాష్ట్ర పునర్విభజన విభాగం కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి కలసి ఆదివారంతో పూర్తి చేశారు.
పోస్టుల పంపిణీ అనంతరం అభ్యంతరాలను తెలియజేయడానికి ఆన్‌లైన్ గ్రీవియన్స్‌కు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సోమవారం రూపొందించనున్నారు. రాష్ట్రస్థాయి పోస్టులను జనాభా నిష్పత్తి ప్రకారం పంపిణీ చేయనున్నారు. శాఖలవారీగా, కేడర్‌వారీగా రాష్ట్రస్థాయి పోస్టుల్లో ఏపీకి 58.32 శాతం, తెలంగాణకు 41.68 శాతం పోస్టులను పంపిణీ చేయనున్నారు. ఇందుకనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. జనాభా నిష్పత్తి మేరకు కంప్యూటరే 2 రాష్ట్రాలకు పోస్టులను పంపిణీ చేయనుంది. దీన్ని మంగళవారం నుంచి ప్రారంభించాలని కమలనాథన్ కమిటీ నిర్ణయించింది.
ఇప్పటికే సిద్ధంగా ఉన్న విభాగాలకు చెందిన మొత్తం పదిశాఖల పోస్టులను మంగళవారం కంప్యూటర్ ద్వారా పంపిణీ చేస్తూ ప్రొవి జనల్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. దీనిపై సమస్యలను తెలపడానికి పదిరోజుల గడువిస్తారు. పూర్తి సమాచారం సిద్ధమైన విభాగాల పోస్టులను పంపిణీ చేస్తూ, ఉద్యోగులందరికీ ఆప్షన్‌పత్రాలను ఇవ్వాలని నిర్ణయించింది. ఉద్యోగుల కేటాయింపునూ కంప్యూటర్ ద్వారానే చేయనున్నారు.
స్థానికత, సీనియారిటీ, ఆప్షన్, ఇతర మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుంటూ పంపిణీ జరిపేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. దీంతో కంప్యూటరే ఏ ఉద్యోగి ఏ రాష్ట్రానికో కేటాయిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రస్థాయి కేడర్‌పోస్టులు 76 వేలున్నాయి. ఇందులో 51 వేల మందే పనిచేస్తుండగా, మిగతా పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. మరో వెయ్యి మల్టీజోనల్ పోస్టులున్నాయి.
కొలిక్కివచ్చిన పోస్టుల విభజన
Published Mon, Nov 17 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement
Advertisement