లేడీస్‌ స్పెషల్‌ ప్లీజ్‌ | Experts Ask To Special Buses For Ladies In Hyderabad City | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 29 2018 10:56 AM | Last Updated on Sat, Sep 29 2018 11:31 AM

Experts Ask To Special Buses For Ladies In Hyderabad City - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని బస్టాప్‌లలో ప్రయాణికులు తమ గమ్యం చేర్చే సిటీ బస్సు కోసం గంటల తరబడి ఎదురు చూస్తుంటారు.. అది ఎప్పుడు వస్తుందో ఎవరన్నా చెప్పగలరా..? వచ్చిన బస్సు బస్‌బేలో ఆగాలి.. అలా ఎప్పుడన్నా, ఎక్కడన్నా జరిగిందా? వస్తే బస్సులన్నీ ఒకేసారి  వరుసకడతాయి.. లేదంటే ఒక్కటీ కనిపించదు. ఆలాంటప్పుడు విసిగిపోయిన ప్రయాణికులు ఏ ఆటోనో.. మరో ప్రవేట్‌ వాహనాన్నో నమ్ముకుంటారు. ఇది ఆర్టీసీ ఉన్నతాధికారులకు తెలియందికాదు. ప్రయాణికుల నమ్మకం సంపాదించలేని సంస్థకు లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? అయినా వారు పట్టించుకోరు. ఎందుకంటే సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నా వారికి ప్రతినెలా జీతాలు వస్తాయి గనుక.

ఇదే అంశాన్ని నిపుణల కమిటీ తేల్చి చెప్పింది. ప్రయాణికులకు నమ్మకమైన, సురక్షితమైన రవాణా సదుపాయాన్ని కల్పించినప్పుడే గ్రేటర్‌ ఆర్టీసీలో నష్టాలు తగుతాయని కమిటీ చెప్పింది. ప్రత్యేకించి మహిళా ప్రయాణికుల రవాణా సదుపాయాలను విస్తృతం చేయాలని సూచించింది. అన్ని సమయాల్లోనూ తమ కోసం సిటీ బస్సు అందుబాటులో ఉందన్న భరోసాను కల్పించాలంది. ఉబర్, ఓలా వంటి క్యాబ్‌ల తరహాలో సిటీ బస్సులు సైతం మహిళా ప్రయాణికులకు అనుకూలమైన సేవలను అందజేయాలని చెప్పింది. పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు, సరైన దిశానిర్దేశానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ ప్రతినిధులు అన్ని రంగాల్లో ఆర్టీసీపై సమగ్రమైన అధ్యయనం చేశారు. కొద్ది రోజుల క్రితం బస్‌భవన్‌లో జరిగిన సమావేశంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ నష్టాలపై కమిటీ దృష్టి సారించింది. ఆర్టీసీ స్థలాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను పెంపొందించడంతో పాటు, మెజారిటీ ప్రయాణికులైన మహిళల రవాణా సదుపాయాలకు అనుగుణంగా సిటీ సర్వీసులను విస్తరించాలని స్పష్టం చేశారు.  

ఇప్పటికి అరకొర సర్వీసులే.. 
గ్రేటర్‌ సిటీ బస్సుల్లో ప్రతిరోజు సుమారు 33 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వారిలో 15 లక్షల మందికి పైగా  మహిళలే. సొంత వాహనాల్లో  ప్రయాణించేవారి సంఖ్య తక్కువే. మరోవైపు  ఓలా, ఉబర్‌ వంటి క్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాక వాటినికి వినియోగించుకొనే మహిళల సంఖ్య పెరిగింది. నమ్మకమైన, కచ్చితమైన సర్వీసులు క్యాబ్‌ల నుంచి లభించడమే ఇందుకు కారణమని కమిటీ  అభిప్రాయపడింది. క్యాబ్‌ల తరహాలో సిటీ బస్సుల్లో కూడా మహిళలకు ప్రత్యేక సేవలు ఉండాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో  59 ‘లేడీస్‌ స్పెషల్‌’ బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. ఈ బస్సులు సైతం కేవలం ఉద్యోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉదయం, సాయంత్రం వేళల్లో తిప్పుతున్నారు.

ఈసీఐఎల్, సికింద్రాబాద్, వనస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, కుషాయిగూడ, మిధాని, అల్వాల్, కూకట్‌పల్లి, తదితర ప్రాంతాల నుంచి సెక్రటేరియట్, నాంపల్లి, గాంధీభవన్, లక్డీకాపూల్‌ వంటి ప్రభుత్వ కార్యాలయాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉదయం7 నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వీటిని నడుపుతున్నారు. అలా కాకుండా అన్ని వేళల్లో, అన్ని ప్రధాన రూట్లలో లేడీస్‌ స్పెషల్స్‌ను పెంచాలి. తమ కోసం ప్రత్యేక బస్సులు ఉన్నాయనే నమ్మకాన్ని కలిగించాలి. పైగా ఈ బస్సుల్లో భద్రతా సదుపాయాలు ఉండాలని నిపుణులు సూచించారు.  

టిక్కెట్టేతర ఆదాయం పెంచాలి 
ఆర్టీసీ సొంత స్థలాల్లో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను అభివృద్ధి చేయడం ద్వారా టిక్కెట్టేతర ఆదాయాన్ని పెంచుకోవాలనే ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. నిపుణుల కమిటీ కూడా ఇదే అంశంపై ప్రధానంగా చర్చించింది. ప్రస్తుతం కోఠి, చార్మినార్, హయత్‌నగర్, ఈసీఐఎల్, కూకట్‌పల్లి, కాచిగూడలో ప్రయాణికుల ప్రాంగణాలు ఉన్నాయి. అక్కడ నిర్మించిన కమర్షియల్‌ కాంప్లెక్సులను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆర్టీసీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. కూకట్‌పల్లి, ఈసీఐఎల్, హయత్‌నగర్‌ వంటి కొన్ని బస్‌స్టేషన్లలో ఆశించిన ఆదరణ లభించకపోవడం వల్ల కాంప్లెక్సులు ఖాళీగానే ఉన్నాయి. మరోవైపు జూబ్లీ, మహాత్మ గాంధీ బస్‌స్టేషన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ కార్యకలాపాలను పెంచాలని, మినీ థియేటర్ల ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని ఆర్టీసీ మొదటి నుంచి భావిస్తోంది.

కానీ వ్యాపార వర్గాల నుంచి పెద్దగా డిమాండ్‌ కనిపించకపోవడంతో ఇప్పటి దాకా కమర్షియల్‌ కార్యకలాపాలు మొదలు కాలేదు. నిపుణులు కమిటీ సైతం ఇటీవల ఇదే అంశంపై చర్చించింది. టిక్కెట్టేతర ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీ స్థలాలపై అధ్యయనం చేపట్టింది. గ్రేటర్‌లో మొత్తం 29 డిపోలు ఉన్నాయి. వాటిలో కనీసం 10 డిపోల్లో  అందుబాటులో ఉన్న స్థలాల్లో షాపింగ్‌ మాల్స్, సూపర్‌ మార్కెట్లు, ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్ల వంటివి ఏర్పాటు చేయడం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందవచ్చునని సూచించింది. ‘గ్రేటర్‌ ఆర్టీసీ ప్రస్తుతం రూ.430 కోట్లకు పైగా నష్టాల్లో ఉంది. ఈ నష్టాలను అధిగమించేందుకు నిపుణుల కమిటీ అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. లోతుగా అధ్యయనం చేస్తోంది. కమిటీ నివేదిక ఆధారంగా  తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement