సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లోని ఎన్టీ యార్, కాళోజీ నారాయణ రావు వైద్య విశ్వవిద్యాలయాలు సహా దేశవ్యాప్తంగా డీఎం, ఎంసీహెచ్ తదితర సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో వివిధ కారణాలతో ఖాళీగా మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు గడువు పొడిగిస్తూ సుప్రీం కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య విద్యలో సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాల భర్తీ షెడ్యూలు ప్రకారం ఆగస్టు 31లోగా కౌన్సెలింగ్ పూర్తయినప్పటికీ దేశవ్యాప్తంగా 1,969 సీట్లు భర్తీ మిగిలిపోయాయి.
ఈ నేపథ్యంలో సీట్లు ఖాళీగా ఉన్నాయని, ప్రవేశాలకు మరింత గడువు పెంచాలని రిట్ పిటిషన్ దాఖలవడంతో కోర్టు ఈ గడువును సెప్టెంబర్ 14కు పొడిగించింది. అయినా 553 సీట్లు మిగిలిపోయాయి. వీటిలో తెలంగాణలో 26, ఏపీలో 22 కూడా ఉన్నా యి. సీట్ల భర్తీకి గడువును పొడిగించాలని దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలతో పాటు ఏపీ నుంచి పిన్నమనేని సిద్దార్థ కళాశాల, నారాయణ వైద్య కళాశాలలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.
ఏపీ నుంచి పలువురు విద్యార్థులు, కళాశాలల తరపున న్యాయవాది అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్, జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను బుధవారం విచారించి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సీట్ల భర్తీ గడువు పొడిగింపులో నాలుగు షరతులు విధించారు.
1) భర్తీ కాని 553 సీట్లకు 10 రోజుల్లోగా డీజీహెచ్‌ఎస్ మాప్ అప్ కౌన్సెలింగ్ నిర్వహించాలి.
2) షెడ్యూల్‌ను, కౌన్సెలింగ్ తేదీలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(డీజీహెచ్‌ఎస్) నిర్ణయిస్తుంది. అభ్యర్థులకు కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు తగిన సమయం ఇవ్వాలి. జాతీయ వార్తాపత్రికల్లో వరసగా 5 రోజులపాటు ప్రకటన ఇవ్వాలి. డీజీహెచ్‌ఎస్, భారత వైద్యమండలి(ఎంసీఐ) వెబ్‌సైట్‌లో కూడా వివరాలను ఉంచాలి.
3) కౌన్సెలింగ్‌ను సాధ్యమైనంత మేరకు ఒకే నిర్ధిష్ట తేదీలో నిర్వహించాలి.
4) అభ్యర్థులు సీట్లు పొందాక చేరేందుకు 4 రోజుల కంటే ఎక్కువ వ్యవధి ఇవ్వరాదు.ఈ ఉత్తర్వులు ప్రస్తుత విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తాయని సుప్రీం కోర్టు ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment