ఫలించని జానా దౌత్యం
వనపర్తి: వనపర్తిని జిల్లాగా ప్రకటిం చాలని మూడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి దీక్షను విరమించజేసేందుకు సీఎల్పీ నేత జానారెడ్డి చేసిన ప్రయత్నం ఫలించలేదు. సోమవారం హైదరాబాద్‌లో జానారెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రెడ్డితో చిన్నారెడ్డి దీక్ష విషయం చర్చించిన అనంతరం ఆయన రాత్రి వనపర్తికి వచ్చారు.
చిన్నారెడ్డిని పరామర్శించి ఆయనతో మాట్లాడుతూ ప్రస్తుతానికి దీక్ష విరమించాలని.. అసెంబ్లీ వేదికగా వనపర్తి జిల్లా కోసం పోరాటం సాగిద్దామని చెప్పారు. తాను సీఎంతో మాట్లాడానని.. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పరిశీలిస్తామని సీఎం చెప్పారని వివరించారు.
అయితే, దీక్ష విరమణకు చిన్నారెడ్డి ఒప్పుకోలేదు. వనపర్తిని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నేరుగా ప్రకటించే వరకు దీక్షను కొనసాగిస్తానని చిన్నారెడ్డి చెప్పారు. జానారెడ్డి మాట్లాడుతూ చిన్నారెడ్డికి వనపర్తి ప్రజల ఆకాంక్ష అత్యంత ముఖ్యమే అయినా.. ఆయన జాతీయస్థాయిలో కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పని చేస్తున్నారని.. ఆయన సేవలను మిగతా అంశాల్లో వినియోగించుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చి ఉంటే రెండు నిమిషాల్లో వనపర్తిని జిల్లాగా చేసేవారమని జానారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు కాంగ్రెస్ పార్టీ అన్నం పెడ్డితే.. తమ పార్టీకి ఇక్కడి ప్రజలు సున్నం పెట్టారని అన్నారు. పదవులు పోగోట్టుకుని పార్టీని ఫణంగా పెట్టి ఆనాడు తాము తెలంగాణ తెచ్చే విషయంలో సోనియాగాంధీని ఒప్పించామన్నారు.
తాము పడిన కష్టాన్ని ఓటర్లు గుర్తించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆమరణ నిరాహార దీక్ష కు మద్దతిచ్చిన అఖిలపక్షాలతో చర్చించిన అనంతరం వారు దీక్ష కొనసాగింపునకే మొగ్గు చూపడంతో దీక్షను విరమించేది లేదని చిన్నారెడ్డి తెగేసి చెప్పారు. దీంతో జానారెడ్డి ఆయన వెంట వచ్చిన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌లు వెనుదిరిగారు.