సాక్షి, రంగారెడ్డి జిల్లా : పంట రుణాల మాఫీ పథకంలో అక్రమార్కులకు అధికారులు కళ్లెం వేశారు. రుణమాఫీ జాబితాలో అనర్హుల పేర్లు చొప్పించిన గుట్టును రట్టు చేసిన మండల కమిటీలు.. వారి అర్హతను రద్దు చేశాయి. ఫలితంగా వారికి ప్రభుత్వం విడుదల చేసిన పంటరుణ మాఫీ తొలివిడత నిధులను తిరిగి సర్కారు ఖాతాకు మళ్లించారు. జిల్లాలో 3,282 మంది బోగస్ లబ్ధిదారులకు సంబంధించి రూ. 6.44 కోట్లను యంత్రాంగం ఇటీవల వెనక్కు పంపింది.
కొత్త రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తూ అర్హులను గుర్తించాల్సిందిగా ఆదేశించింది. దీంతో చర్యలకు దిగిన జిల్లా యంత్రాంగం.. పలుమార్లు వడపోత అనంతరం జిల్లా వ్యాప్తంగా 2,10,257 మందిని అర్హులుగా గుర్తించింది. వీరికి రూ.1,032.41 కోట్లు మాఫీ చేయాల్సిందిగా పేర్కొంటూ జాబితాను ప్రభుత్వానికి సమర్పించింది. రుణ మాఫీని నాలుగు విడతల్లో చెల్లించనున్నట్లు ప్రకటించిన సర్కారు.. తొలివిడత కింద రూ.258.10 కోట్లు విడుదల చేసింది.
యంత్రాంగం రూపొందించిన జాబితాలో అనర్హులున్నట్లు అప్పట్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమచేసేముందు మరోసారి పరిశీలన చేపట్టాలని నిర్ణయించింది. ఈక్రమంలో జిల్లా వ్యాప్తంగా 3,282 మందిని జాబితా నుంచి తప్పిస్తూ.. మిగతా 2,06,975 మంది రైతులకు మాఫీ నిధులు బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. అనంతరం జాబితా నుంచి తప్పించిన రైతుల వివరాలను పూర్తిస్థాయి పరిశీలన చేపట్టారు. ఇందులో పరిమితికి మించిన రుణాలు, బంగారు ఆభరణాల లోన్లు, నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు, ఖాతా నంబర్లలో డూప్లికేట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వారి అర్హతను రద్దు చేశారు.
మాఫీ రూ.1,006.84 కోట్లే..
రుణ మాఫీలో అనర్హుల పేర్లు తొలగించడంతో ప్రభుత్వానికి కొంత భారం తగ్గింది. తొలుత 2,10,257 మందిని అర్హులుగా గుర్తించి.. వారికి రూ.1,032.41 కోట్లు మాఫీ చేయాల్సిందిగా పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదికలిచ్చారు. తాజాగా అనర్హులను జాబితా నుంచి తప్పించారు. ఫలితంగా లబ్ధిదారుల సంఖ్య 2,06,975కు తగ్గింది. అదేవిధంగా మాఫీ మొత్తం కూడా రూ.1,006.84 కోట్లకు చేరింది.
అంటే ప్రభుత్వానికి రూ. 25.76కోట్ల భారం తగ్గింది. ఇందులో ఇప్పటికే రూ.251.71 కోట్లు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమచేసింది. తాజా ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరో రూ. 251.71 కోట్లు ఇవ్వాల్సిందిగా జిల్లా వ్యవసాయశాఖ నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది.
పంట రుణమాఫీ పథకంలో నకిలీలు
Published Sun, May 10 2015 11:32 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement