చినుకు పడేనా.. చింత తీరేనా?
ఇప్పటికీ విత్తని విత్తు
- అదనుదాటుతున్నా.. కరుణచూపని వరుణుడు
- ఆందోళనలో అన్నదాతలు
- ప్రత్యామ్నాయ ప్రణాళికపై వ్యవసాయశాఖ దృష్టి!
సంగారెడ్డి డివిజన్: అదను దాటుతున్నా వరుణుడి జాడ లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ ప్రారంభమై సుమారు 25 రోజులవుతున్నా వర్షాలు కురవకపోవటంతో రైతులు ఇప్పటికీ విత్తనాలను విత్తుకోలేదు. గత ఏడాది ఈపాటికే.. జిల్లాలో 45 వేల హెక్టార్ల వరకు పంటలను సాగు చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌లో 4.40 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేయాల్సి ఉండగా వర్షాభావం కారణంగా ఇప్పటికీ సాగు మొదలుపెట్టలేదు.
మరో వారం రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే ఈ మాసానికి అతితక్కువ వర్షపాతం నమోదైన జిల్లాగా అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. దీనికితోడు ఈ నెలాఖరు వరకు వర్షాలు కురవని పక్షంలో పెసర, మినుము, జొన్న పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వచ్చే నెలలో వర్షాలు కురిసి పంటల సాగుకు రైతులు సిద్ధమైనా పంటల దిగబడిపై ప్రభావం ఉంటుందని వ్యవసాయశాఖ రంగ నిపుణులు చెబుతున్నారు. వర్షాభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రణాళికపై వ్యవసాయశాఖ అధికారులు దృష్టి సారిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. గురువారం వరకు జిల్లాలో 79.5 మిల్లీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు కేవలం 33.8 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది.గత ఏడాది జూలై 19వ తేదీ నాటికి 95.5 మిలీమీటర్ల వర్షం కురిసింది. అంటే సాధారణం కంటే 20.1 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వరుణుడి జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
వర్షాలు పడకపోతే పెసర, జొన్నపై ప్రభావం
వర్షాభావం కారణంగా రైతులు పంటల సాగు ఇంకా ప్రారంభంలేదు. జిల్లాలో 4.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం బోరుబావుల కింద 270 హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు వేశారు. అలాగే 3,134 హెక్టార్లలో వరి నారుమళ్లు వేసుకున్నారు. వర్షాలు కురవకపోవటంతో పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న, పత్తి, కంది తదితర పంటల విత్తనాలను ఇంకా విత్తుకోలేదు.
ఈ నెలాఖరు వరకు వర్షాలు కురవని పక్షంలో పెసర, మినుము, జొన్న పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. తప్పనిసరిగా నెలాఖరులోగా పెసర, మినుము, జొన్న విత్తనాలు విత్తుకోవాలి. లేనిపక్షంలో అదను దాటే అవకాశం ఉంది. ఒకవేళ వచ్చే నెలలో విత్తనాలు విత్తుకున్నా పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో జిల్లాలో 15 వేల హెక్టార్లలో జొన్న, 38 వేల హెక్టార్లలో పెసర, 18 వేల హెక్టార్లలో మినుము పంటలు సాగు కావాల్సి ఉంది.
వర్షాభావం వల్ల ఆయా పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పత్తి, కంది, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలు వచ్చే నెల 15వ తేదీలోగా విత్తుకునేందుకు అవకాశం ఉంది. అప్పటికీ వర్షాలు కురవనిపక్షంలో ఆయా పంటలసాగుపైనా ప్రభావం పడనుంది.
ఆందోళన చెందవద్దు: జేడీఏ
జిల్లాలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నా రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి భుక్యా తెలిపారు. నెలాఖరులోగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు. ఖరీఫ్‌లోరైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. వచ్చేనెల కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొంటే రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగును సూచిస్తామని తెలిపారు.