
నాలుగు చక్రాల బండి కింద తలదాచుకున్న వృద్ధురాలు
భువనగిరి: వృద్ధాప్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని ఓ వ్యక్తి నిర్దయగా రోడ్డున పడేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం అన్నోజిగూడం సమీపంలో నివాసం ఉంటున్న 77 ఏళ్ల కిష్టమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమె కుమారుడు ఐదు రోజుల క్రితం భువనగిరిలోని ఓ ఆస్పత్రికి తీసుకువచ్చాడు. అయితే ఆదివారం ఆమె కుమారుడు, కోడలు కలసి వృద్ధురాలి వద్ద ఉన్న రూ.40 వేలు తీసుకొని ఆమెను భువనగిరి కొత్త బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన వదిలివెళ్లారు. దిక్కుతోచక బస్టాండ్ సమీపం లో రోడ్డు పక్కన ఉన్న నాలుగు చక్రాల బండి కింద తలదాచుకున్నట్లు బాధితురాలు తెలిపింది. విషయం తెలుసుకున్న అమ్మఒడి ఆశ్రమ నిర్వాహకులు వృద్ధురాలికి భోజనం అందజేశారు. ప్రస్తుతం వృద్ధురాలు బస్టాండ్ వద్దనే నాలుగు చక్రాల బండి కింద ఉంది. వృద్ధురాలిని సంరక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.