బాహుబలి ఫీవర్
సినిమా చూపిస్తున్న ‘బాహుబలి’
- సినిమా థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం
- ఒకరోజు ముందుగానే టికెట్ల కోసం పడిగాపులు
- అడ్వాన్స్ బుకింగ్‌లో ధరలకు రెక్కలు
- జిల్లాలో 62 థియేటర్లు ఉంటే 58 థియేటర్లలో నేడు విడుదల
- అడ్వాన్స్ బుకింగ్‌లో అత్యధిక ధరలు
- ప్రేక్షకుల జేబులకు భారీగా చిల్లులు
- బంద్ ఎఫెక్ట్‌తో ‘ఆందోళన’
వనపర్తిటౌన్: మూడేళ్ల నుంచి ఊరించి ప్రేక్షకుల్లో భారీ అంచనాలతో వస్తున్న బాహుబలి సినిమా విడుదలకు ముందే థియేటర్ యజమానులకు కాసుల వర్షం కురిపిస్తోంది. జిల్లాలో మొత్తం 62థియేటర్లు ఉంటే శుక్రవారం 58 థియేటర్లలో బాహుబలి విడుదల కానుంది. వనపర్తి, మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, ఆమనగల్లు, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో గత వారం రోజులుగా అడ్వాన్స్ బుకింగ్ పేర్లతో టికెట్ రేట్లను రెట్టింపు చేసేశారు. రూ.10లు ఉండే లోక్లాస్ టికెట్ నుంచి రూ.50లు ఉండే ఫస్ట్‌క్లాస్ టికెట్లను రూ.60 నుంచి రూ.200వరకు పెంచి అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చేశారు.
కొన్ని థియేటర్లలో ఏ క్లాసైనా రూ.100లకు అమ్ముతున్నారు. బాహాటంగా టికెట్ ధరలను పెంచిన థియేటర్ యజమానులు తినుబండారాలు, శీతల పానీయాలు సైతం పెంచి, ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టి కాసులు దండుకునేందుకు సిద్ధమయ్యారు. మహబూబ్‌నగర్‌లో అర్ధరాత్రి నుంచే ప్రత్యేక షోలు ప్రారంభమవుతుండగా, వనపర్తి, జడ్చర్లలో తెల్లవారుజాము నుంచి ఆటలు మొదలు పెట్టనున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 50వేలకు పైగా టికెట్లు అమ్మినట్లు థియేటర్ నిర్వాహకులు చెబుతున్నారు. ఒకట్రెండు థియేటర్లలో తప్పా.. మిగిలిన వాటిలో సీట్ల పరిమితికి మించి టికెట్ల అమ్మకాలు చేపట్టారు.
మరోవైపు ప్రతి మూడు, ఆరు నెలలకొకసారి అధికారులు తప్పకుండా థియేటర్‌లను తనిఖీ చేయాల్సి ఉన్నా.. జిల్లాలో ఎక్కడా ఆ పనిచేసినట్లు కనిపించడం లేదు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు చేపట్టవద్దని కేంద్రానికి లేఖ రాసిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరికి నిరసనగా జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ శుక్రవారం బంద్‌కు పిలుపునివ్వడంతో సినిమా థియేటర్ యజమానులు ఆందోళనలో పడ్డారు. థియేటర్‌లకు వచ్చే నేతలకు ఎలాగైనా సర్దిచెప్పాలని కొందరు భావిస్తుంటే, మరికొందరు వారిని మచ్చిక చేసుకునేందుకు రంగంలోకి దిగారు. అయితే జిల్లాలో బంద్ ఎఫెక్ట్ బాహుబలిపై ఎంత ప్రభావం చూపుతుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది.
రాత్రి నుంచి థియేటర్‌లోనే...
టీఆర్‌ఎస్ పార్టీ బంద్ ఇచ్చిన నేపథ్యంలో ఎలాగైన తొలి షో చూడాలనే ఆశతో అభిమానులు గురువారం రాత్రి ఎనిమిది గంటల నుంచే థియేటర్ల వద్దకు చేరుకున్నారు. వనపర్తిలోని శ్రీరామా థియేటర్ వద్ద గురువారం సెకండ్‌షో సైతం వేయనీయకుండా దాదాపు వెయ్యి మంది అభిమానులు థియేటర్‌లోకి దూసుకెళ్లి సీట్లలో కూర్చున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మొ దటి ఆట చూసే వెళ్తామని అభి మానులు తేల్చిచెప్పారు. అంతకు ముందు థియేటర్ వద్ద వేరే ప్రాం తం నుంచి వచ్చిన అభిమానుల కోసం థియేటర్ వద్ద భోజనాల ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిం చగా, ఒకేసారి వెయ్యి మంది రావడంతో ఆ ప్రయత్నాన్ని విరమించారు.