ఖమ్మం : వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన రైతు ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి బలైపోయాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పినపాక మండలం పోట్లపల్లి పంచాయతీ పరిధిలోని గోవిందాపురంలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గోవిందాపురం గ్రామానికి చెందిన బుగ్గలి కృష్ణయ్య తనకు ఉన్న ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం పొలంలోని బావి వద్దకు వెళ్లిన వ్యక్తి ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెళ్లి చూడగా.. బావి వద్ద విగతజీవిగా పడి ఉన్నాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య కమలతో పాటు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు.