బీ(ధీ)మా ప్రశ్నార్థకం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రుణమాఫీపై సర్కారు సాగదీత ధోరణి, కమిటీలు, సమీక్షలు, గణాంకాల పేరిట కాలయాపన చేయడంతో అన్నదాతల పంటలకు బీమా వర్తించకుండా పోయింది. పంటల బీమా పథకానికి గడువు మంగళవారం(సెప్టెంబర్ 30)తో ముగిసింది. ఈలోపు పంట రుణాలు పొందిన రైతులు మాత్రమే అర్హులు. కానీ రుణమాఫీకి సంబంధించిన కసరత్తు ఈ గడువు దగ్గర పడే వరకు పూర్తి కాకపోవడంతో జిల్లాలో 90 శాతం మంది రైతులకు పంట రుణాలు అందలేదు. దీంతో ఈ ఖరీఫ్ పంటలకు బీమా ప్రశ్నార్థకంగా తయారైంది.
కసరత్తు పేరుతో కాలయాపన
ఖరీఫ్ పంట కాలం ముంచుకొచ్చినా ప్రభుత్వం రుణమాఫీ కసరత్తు పేరుతో కాలయాపన చేస్తూ వచ్చింది. సెప్టెంబర్ మూడో వారంలో ఈ కొలిక్కి రాగా, జిల్లాలో 3.13 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1,477.45 కోట్ల పంట రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మాఫీ అయ్యే ఈ మొత్తంలో మొదటి విడతలో 25 శాతం నిధులు రూ.377.73 కోట్లను ఇటీవలే విడుదల చేసిన సర్కారు నెలాఖరులోపు పంట రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించింది. కానీ ఈ నిధులు తమ శాఖకు అందలేదని బ్యాంకర్లు రుణాలు మంజూరు ప్రక్రియను ప్రారంభించలేదు. తీరా బీమా పథకానికి గడువు దగ్గర పడటంతో ఈనెల 28 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించారు. మధ్యలో సెలవు రోజు రావడంతో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది.
డీజీబీ వంటి బ్యాంకులు ఆదివారం పనిచేయకపోగా సోమవారం ఈ నిధులు ఆయా శాఖలకు చేరాయి. దీంతో రెండు, మూడు రోజులే గడువుండటంతో రైతులు పెద్ద సంఖ్యలో బ్యాంకుల వద్దకు పరుగులు తీశారు. కానీ అక్కడ రుణ మంజూరు జాప్యం జరుగడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఖరీఫ్ సీజనులో రూ.1,693 కోట్ల మేరకు పంట రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు మీద నిర్దేశిత లక్ష్యంలో కనీసం 15 శాతం మంది రైతులకు కూడా రుణాలు దక్కకపోవడంతో మిగిలిన సుమారు 85 శాతం రైతులకు ఈ బీమా పథకం వర్తించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బీమా పథకానికి గడువు అక్టోబర్ 15 వరకు పొడిగించాలని జిల్లా అధికార యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిం చేసింది.
పరిహారం ప్రశ్నార్థకం
ఈ ఖరీఫ్ సీజనులో వర్షాలు ఆలస్యంగా కురిసాయి. జూన్ మొదటి వారంలో రావాల్సిన రుతుపవనాల జాడ రెండు నెలలుగా లేకపోవడంతో పంటలు ఎండిపోయి దాదాపు కరువు పరిస్థితులు నెలకొన్నాయి. భూమిలో తేమ లేక విత్తనాలు మొలకెత్తకపోవడంతో అనేక చోట్ల రైతులు రెండుసార్లు విత్తుకోవాల్సి వచ్చింది. ఈ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని పెరిగిన పంటలను ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలు నిండా ముంచాయి. ఈ భారీ వర్షాలకు పత్తి, సోయా వంటి ప్రధాన పంటలు తెగుళ్ల బారిన పడ్డాయి. దీంతో ఈసారి పంటల దిగుబడి సగానిక సగం పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ తరుణంలో పంటల బీమా వర్తించకపోవడంతో అన్నదాతల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. నష్టపోయిన పంటలకు పరిహారం అందే పరిస్థితి లేకుండా పోయింది. జిల్లాలో ఈ ఏడాది వరి, జొన్న, మొక్కజొన్న, మినుములు, పెసర, కందులు, సోయా, మిరప(వర్షాధారం), పసుపు పంటలకు బీమా పథకాన్ని కేంద్రం అమలు చేస్తోంది. రైతులు అత్యధికంగా పండించే సోయాకు గ్రామ యూనిట్‌గా తీసుకుని పంట నష్ట పరిహారం చెల్లించనుండగా, మిగితా పంటలకు మండలాన్ని యూనిట్‌గా తీసుకోనున్నారు.