నర్సాపూర్,న్యూస్‌లైన్: పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్యకు చెందిన పాల శీతలీకరణ కేంద్రం నిర్వహణ సరిగా లేనందున రెండేళ్ల క్రితం మూత పడింది. సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని కొంత కాలం పాటు మండల మహిళా సమాఖ్యకు అప్పగించగా వారు కూడా విఫలం కావడంతో సమాఖ్య ఆధ్వర్యంలో కొంతకాలం నిర్వహించి అనంతరం నష్టాలు వచ్చాయంటూ రెండేళ్ల క్రితం మూసివేశారు. కాగా మార్కెట్‌లో పాల కొనుగోలు కేంద్రాల నిర్వహకుల వ్యాపారం జోరుగా కొనసాగుతుండగా ప్రభుత్వానికి చెందిన పాల శీతల కేంద్రానికి నష్టాలు వచ్చాయంటూ మూత వేయడం గమనార్హం. కేంద్రం బాధ్యతలు తీసుకున్న వ్యక్తులు సక్రమంగా నిర్వహంచక పోవడంతో నష్టాలు వచ్చినట్లు తెలిసింది.
ధర లభించక నష్ట పోతున్న రైతులు
నర్సాపూర్‌లో ప్రభుత్వ పాల సేకరణ కేంద్రం లేనందున పాడి రైతులు ప్రైవేటు పాల కేంద్రాలపై ఆధార పడాల్సి వస్తోంది. దీంతో రైతులకు ఆశించిన ధర లభించక పోవడంతో నష్టాల పాలవుతున్నారు. ప్రైవేటు పాల కొనుగోలు దారులు తమ ఇష్టమొచ్చినట్లు నిబంధనలు పెడుతూ ఇష్టానుసారంగా ధర నిర్ణయించడంతో తాము నష్ట పోతున్నామని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన పాలు తీసుకుపోయినా లీటరుకు రూ.30 నుంచి రూ.35కు మించి ఇవ్వడం లేదని తెలిసింది.
పాడి గేదెల నిర్వహణకు ఖర్చులు బాగా పెరుగుతున్నాయని, పాలు అమ్మితే ఆశించిన ధర లభించక పోవడంతో గేదెలు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రభుత్వం పాడి పరిశ్రమను అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా రైతులకు, మహిళలకు పాడి గేదెలను సబ్సిడీతో కూడిన రుణాలను కార్పొరేషన్ల ద్వారా అందజేస్తూ గేదెలు ఇప్పిస్తోంది. ప్రభుత్వం పాడి అభివృద్ధికి చర్యలు తీసుకుంటుండగా పాడి సమాఖ్య అధికారులు పాలు కొనుగోలు చేసేందుకు, పాల శీతలీకరణ కేంద్రాల నిర్వహణపై దృష్టి పెట్టకపోవడంతో గేదెలు కొనుగోలు చేసిన రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు.
తనిఖీ చేయరా?
నర్సాపూర్‌లోని పలు ప్రైవేటు పాల సేకరణ కేంద్రాల నిర్వాహకులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రైవేటు పాల కొనుగోలుదారులు రైతల నుంచి పాలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడే లీటరు పాలను రూ.40 కి విక్రయిస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. అంతేగాక రైతుల నుంచి తీసుకున్న పాలల్లో నీళ్లు కలిపి అమ్ముతున్నారని, అవి పలుచగా ఉండకుండా రసాయనాలు కలిపి చిక్కగా మారేలా చేస్తున్నట్లు తెలిసింది. కాగా ఆహార పదార్థాలను తనిఖీ చేసే ప్రభుత్వ విభాగం అధికారులు పాల కొనుగోలు కే ంద్రాల వైపు కన్నెత్తి చూడక పోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
రూ. పది లక్షలు వెచ్చించినా ప్రయోజనం శూన్యం
ప్రభుత్వం ఇక్కడ రూ. పదిలక్షల వ్యయంతో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేసినా నిర్వహణ సరిగాలేకపోవడంతో అది మూత పడింది. దీంతో నిధులు వృధా కావడంతో పాటు ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోవడంతో రైతులు నష్ట పోతున్నారు. అధికారులు ఇప్పటికైనా ఈ కేంద్రాన్ని వినియోగంలోకి తేవాలని రైతులు కోరుతున్నారు. ఇది ఇలా ఉండగా పాల శీతలీకరణ కేంద్రం మూత పడడంతో మందుబాబులకు అది అడ్డగా మారింది.