అకాలం తెచ్చిన చేటు కాలం | farmers getting struggle | Sakshi
Sakshi News home page

అకాలం తెచ్చిన చేటు కాలం

Published Mon, May 4 2015 2:12 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

అకాలం తెచ్చిన చేటు కాలం - Sakshi

అకాలం తెచ్చిన చేటు కాలం

రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకుంది...
తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది...
 భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లూ ఒట్టిపోయాయి...
 సాగయిన కొద్దిపాటి పంటలూ ఎండిపోయాయి...
 అంతోఇంతో మిగిలిన వాటినీ
 అకాల వర్షాలు మింగేశాయి...
 ఈ దుస్థితిలో ఎటూ తోచక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులెలా తీర్చాలో తెలియక ఆవేదనలో మునిగిపోతున్నారు.
 
 రాష్ట్రంలో ఈసారి వ ర్షపాతం వివరాలను పరిశీలిస్తే చాలు.. కరువు కోరలు సాచినట్లు స్పష్టమవుతోంది. పంటలకు అవసరమైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికితోడు అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కంటే సరాసరి 26 శాతం తక్కువగా నమోదయింది. దీంతో సాగు గణనీయంగా తగ్గిపోయింది. రబీలో సాధారణంగా 15.39 లక్షల హెక్టార్లలో పంటలు సాగుకావాల్సి ఉంటే.. ఈసారి 10.24 లక్షల హెక్టార్లలోనే సాగయ్యాయి. గత సీజన్‌లో వరిసాగు 8.28 లక్షల హెక్టార్లుకాగా.. ఈసారి 4.37 లక్షల హెక్టార్లకే పరిమితమైంది. మొక్కజొన్న 1.99 లక్షల హెక్టార్లకుగాను.. 1.65 లక్షల హెక్టార్ల వద్దే నిలిచిపోయింది. ఇతర పంటల సాగు కూడా బాగా తగ్గిపోయింది.    
 - సాక్షి నెట్‌వర్క్
 
  ఆవేదనే మిగిలింది..
 
 ఆదిలాబాద్ జిల్లాలో రబీలో 116 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా.. ఈసారి 31.4 మిల్లీమీటర్లే నమోదైంది. రబీ సాధారణ సాగు విస్తీర్ణం 1.82 లక్షల హెక్టార్లు కాగా, ఈసారి 1.27 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగ య్యాయి. జిల్లాలో పంటలకు ప్రధాన నీటి వనరు అయిన కడెం ప్రాజెక్టులో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరింది. మరోవైపు గోదావరి నది ఎడారిని తలపిస్తోంది. కనీసం పశుగ్రాసం దొరక్క రైతులు తమ పాడి పశువులను అమ్ముకుంటున్నారు. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్, బెజ్జూరు, కౌటాల తదితర మండలాల్లోని రైతులు, కూలీలు మహారాష్ట్ర, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లి భవన నిర్మాణ కార్మికులుగా మారుతున్నారు.
 
 
 ఆరుతడి పంటలే..
 నిజామాబాద్ జిల్లాలో రబీ సాధారణ సాగు 2.4 లక్షల హెక్టార్లగాను 1,61 లక్షల హెక్టార్లలోనే పంటలు వేశారు. ఇందులోనూ ఆరుతడి పంటలే ఎక్కువ. వర్షాభావం నేపథ్యంలో భూగర్భ జలాల మట్టం గణనీయంగా పడిపోయింది. మరోవైపు సాగులో ఉన్న కొద్దిపాటి పంటలు కూడా ఈనెల రెండోవారంలో కురిసిన వర్షాలతో బాగా దెబ్బతిన్నాయి.
 
 పాతాళానికి గంగమ్మ..
 
 వరంగల్ జిల్లాలో కరువు, విద్యుత్ సమస్యతో రబీ పంటల విస్తీర్ణం బాగా తగ్గింది. జిల్లావ్యాప్తంగా భూగర్భజలాలు దాదాపు 10 మీటర్ల లోతుకు పడిపోయాయి. కొన్ని మండలాల్లోనైతే ఏకంగా 15 నుంచి 25 మీటర్ల లోతుకు పడిపోవడం ఆందోళనకరం. నీళ్లు అందే అవకాశం లేకపోవడంతో రైతులు పంటల సాగుకు ముందుకు రాలేదు. గతేడాది రబీలో 95,542 హెక్టార్లలో వరి సాగుచేయగా ఈసారి 20,980 హెక్టార్లకు పడిపోయింది. 48,909 హెక్టార్లలో మొక్కజొన్న సాగుచేయగా ఈసారి 24,373 హెక్టార్లకు తగ్గింది.
 
  రైతుకు వార‘బందీ’..
 
 ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టు పరిధిలో వారబందీ విధానంతో చివరి భూముల్లో వరి పంట ఎండిపోతోంది. రెండో జోన్ పరిధిలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని మండలాల్లో వరి పంటది అదే పరిస్థితి. బోనకల్ మండలంలో మొక్కజొన్న కూడా దెబ్బతిన్నది. సాగర్ నీరందక మధిర నియోజకవర్గంలో వరి, మొక్కజొన్న, మిర్చి ఎండిపోయాయి. జిల్లాలో గత రబీలో 43,778 హెక్టార్లలో పంటలు సాగుకాగా.. ఈసారి 27,885 హెక్టార్లకు తగ్గింది.
 
 నష్టం.. కష్టం..
 కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్, మంథని, సిరిసిల్ల ప్రాంతాల్లో వర్షాలు లేక.. కరువు పరిస్థితులు నెలకొన్నాయి. పలుచోట్ల పంటలు చేతికందకుండా పోయాయి. జిల్లాలో గత రబీలో 2,98,564 హెక్టార్లలో పంటలు వేయగా.. ఈసారి 1.82 లక్షల హెక్టార్లలోనే వేశారు. ఇక ఇటీవల కురిసిన వర్షాలు, ఈదురు గాలులతో 7,500 ఎకరాల్లో పంటలు, మామిడి దెబ్బతిన్నాయి.
 
 రైతన్నకు సంకటం
 
 రంగారెడ్డి జిల్లాలో గత ఖరీఫ్‌లోనే బాగా దెబ్బతిన్న రైతన్నకు ఇప్పుడు రబీ కూడా సంకటస్థితిని తెచ్చిపెట్టింది. జిల్లాలో రబీ సాధారణ వర్షపాతం 20.2 సెంటీమీటర్లుకాగా.. ఈసారి ఇప్పటివరకు 13 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణ సాగు విస్తీర్ణం 43,099 హెక్టార్లుకాగా.. 32,723 హెక్టార్లలోనే సాగయ్యాయి. ఇందులోనూ 20వేల హెక్టార్లలో పంటలు కరువు బారినపడ్డాయి.
 
 పాలమూరుకు నీటిగోస
 
 మహబూబ్‌నగర్ జిల్లాలో రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 2.15 లక్షల హెక్టార్లు కాగా.. ఈసారి 90వేల హెక్టార్లలోనే సాగయ్యాయి. ఖరీఫ్ నష్టం నుంచి కోలుకోలేని వరి రైతులు.. దాదాపు 50 వేల హెక్టార్లలో సాగు చేపట్టకుండా అనధికారిక క్రాప్ హాలిడే పాటిస్తున్నారు. ఇక నీళ్లు లేక దాదాపు 20వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. జిల్లాలోని 64 మండలాల్లో 25 మండలాలనే కరువు మండలాలుగా ప్రభుత్వం ఎంపిక చేసింది.
 
 దిగుబడి సగమే..


 
 మెదక్ జిల్లాలో 46 మండలాలు ఉండగా అన్ని మండలాల్లోనూ సాధారణ స్థాయి కన్నా 50 శాతం తక్కువ వర్షపాతం నమోదయింది. 90 శాతం భూమిలో పంటలకు నష్టం కలిగినట్లు అంచనా. రబీలో దాదాపు లక్షాయాభైవేల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. దిగుబడి సాధారణం కన్నా 50 శాతం తక్కువగా వచ్చింది.
 
 పెట్టుబడులే రాలేదు..
 ‘‘గతేడాది పెట్టిన పెట్టుబడులే తిరిగి రాకపోవడంతో ఈసారి దుక్కులు కూడా దున్నలేదు. ఖరీఫ్‌లో మూడెకరాల్లో సోయా, కంది పంటలు వేశాను. కనీసం పెట్టుబడులు కూడా రాలేదు. దుక్కి నుంచి కోత దాకా రూ.60 వేలు పెట్టుబడి పెట్టగా.. పంటలు అమ్మితే రూ.20వేలు కూడా రాలేదు. వ్యవసాయం చేయాలంటేనే భయమేస్తోంది.’’         - మంగలి బాల్‌రాజ్, దామర్‌గిద్దా, కంగ్టి మండలం, మెదక్ జిల్లా
 
 వరుసగా నష్టాలే..
 ‘‘ఖరీఫ్‌లో పత్తి వేశాను. వర్షాభావంతో పంట ఎదగక నష్టం వచ్చింది. ఆ కొంచెం పత్తి ఏరడానికి కూలీలు దొరకలేదు. రెండు బ్యాగుల పత్తి విత్తనాలు వేస్తే.. దిగుబడి వచ్చింది 80 కిలోలే. దీంతో రూ.30వేలకు పైగా నష్టం వచ్చింది. పత్తి కట్టె ఏరివేసి జొన్న వేసినా.. భూమిలో తేమ లేక ఎండిపోయింది. వరుస నష్టాలతో వ్యవసాయం భారంగా మారింది.’’    -ఉప్పరి హన్మండ్లు, దామర్‌గిద్దా, కంగ్టి మండలం
 
 అప్పులే మిగిలాయి..


 ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చెందిన వాగ్మారే గంగాధర్‌కు సిరాల ప్రాజెక్టు ఆయకట్టు కింద ఎకరం పొలం ఉంది. ఇలేగాం శివారులో మరో రెండు ఎకరాల భూమి ఉంది. సిరాల ప్రాజెక్టు నుంచి నీరు అందుతుందనే ఆశతో ఖరీఫ్‌లో వరినారు పోసి, దుక్కి దున్ని పెట్టాడు. కానీ వర్షాల్లేక నీరు రాలేదు. పెంచిన వరినారు పశుగ్రాసానికే పనికొచ్చింది. మిగతా రెండెకరాల్లో వేసిన పత్తి మొలకెత్తలేదు. రెండోసారి విత్తనం వేసినా సరిగా ఎదగలేదు, దిగుబడి సగం కూడా రాలేదు. భార్య, పిల్లలతో కలిసి ఆరుగాలం కష్టపడినా.. చివరకు అప్పులే మిగిలాయి. ఈయేడు వ్యవసాయం చేయాలన్న ఆసక్తి కూడా లేదని, తన ఎడ్లను అమ్మేసి ఎవరి వద్దనైనా పాలేరుగా పనిచేయాలని భావిస్తున్నానని ఆయన వాపోయాడు. తన కుటుంబానికి తిండి కోసం, పిల్లల్ని చదివించేందుకు మళ్లీ ఎవరి వద్ద అప్పు చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
 
 పొలంలో కరువు ‘మంట’


 నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ మండలం అమరవరానికి చెందిన రైతు మద్దుల వెంకటేశ్వర్లు. తనకున్న ఒకటిన్నర ఎకరాల పొలంలో వరి వేశాడు. రూ.30 వేలతో బావిని తవ్వించి, రూ.20 వేలతో చైనా మోటార్‌ను కొనుగోలు చేశాడు. నాట్లు, విత్తనాలు, ఎరువుల కోసం రూ.25 వేలు ఖర్చు చేశాడు. కాలువ నీటితోపాటు బావిలోని నీటిని ఉపయోగించి సాగు పూర్తిచేయవచ్చని భావించాడు. కానీ ఒక్క తడికి కూడా నీరు అందలేదు. భూగర్భ జలాలు తగ్గి బావి ఎండిపోయింది. పంటను కాపాడుకోవాలని బావిని మరింత లోతుగా తవ్వించినా నీళ్లు రాలేదు. నీరందక పొట్టదశలో ఉన్న వరి ఎండిపోయింది. దీంతో ఆవేదన చెందిన వెంకటేశ్వర్లు గ్రామ రైతులు, ప్రజాప్రతినిధుల సమక్షంలోనే తన వరి పంటను తగులబెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement