మోర్తాడ్, న్యూస్‌లైన్: అకాల వర్షంతో తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి తీసుకువెళ్లేందుకు రైస్ మిల్లర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రా ల నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు. అటు రైతు లు, ఇటు మిల్లర్ల మధ్య తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారయ్యిందని వారు వాపోతున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ సహకార సంఘాలు, ఇందిర క్రాంతి పథం మహిళా సంఘాల ఆధ్వర్యంలో 289 కొనుగోలు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. చాలా మంది రైతులు కోతలు పూర్తి కాగానే ధాన్యాన్ని ఈ కేంద్రాలకు తరలించారు. తూకం వేసి, నిర్వాహకులకు అప్పగించి వెళ్లిపోయారు. మామూలుగా అయితే ఈ ధాన్యాన్ని మిల్లర్లు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అనుకోకుండా మూడు రోజుల క్రితం అకాల వర్షం కురియడంతో కొనుగోలు కేంద్రాల నిలువ ఉంచిన దాదాపు ఎనిమిది వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. ఇక్కడే అసలు కథ మొదలైంది.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో
తూకం వేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు వీలుగా కాంట్రాక్టర్లు లారీలను పంపాల్సి ఉంది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎన్నిమార్లు మొత్తుకున్నా కాంట్రాక్టర్ లారీలను పంపడం లేదు. కొనుగోలు కేంద్రాలకు గిడ్డంగుల సౌకర్యం లేదు. దీంతో వారు ధాన్నాన్ని రహదారులపైనే కుప్పలుగా పోసి ఉంచారు. వాటిని తరలించడానికి లారీలు రాక పోవడంతో పెద్ద మొత్తంలో నిలువ ఉన్న ధాన్యం తడిసి పోయింది. దీంతో నిర్వాహకులు జిల్లా కలెక్టర్‌కు, జిల్లా ఉన్నతాధికారులకు విషయా న్ని వివరించారు. లారీలు సకాలంలో కొనుగోలు కేంద్రాల వద్దకు రాకపోవడంతో ధాన్యం నీటిపాలైందని వారి దృష్టికి తెచ్చారు. అధికారుల ఒత్తిడితో కాంట్రాక్టర్ లారీలను పంపాడు. అయితే, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని తీసుకోవడానికి రైస్ మిల్లర్లు నిరాకరించారు. తడిసిపోయిన ధాన్యంలో కొంత తరుగు తీసేసి తిరిగి లెక్క వేయాలని కోరుతూ వారు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు శనివారం తిప్పి పంపించారు.
నష్టం వస్తుందంటూ
జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యాన్ని నిజామాబాద్ మండలం ఖానాపూర్ శివారులోని రైస్‌మిల్లులకు తరలించేందుకు అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వారు తడిసిన ధాన్యాన్ని తీసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అయోమయం లో పడిపోయారు. ధాన్యంలో తేమ శాతం కొంత ఎక్కువగా ఉన్నా పర్వాలేదని, పూర్తిగా తడిస్తే మాత్రం తాము తీసుకోమని మిల్లర్లు చెబుతున్నారని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తెలిపారు. తడిసిన ధాన్యానికి మొలకలు కూడా రావడంతో, వాటిని తీసుకుంటే తాము పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని అంటున్నారని పేర్కొన్నారు.
ఇటు రైతులు తాము తూకం వేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలో అప్పగించి వెళ్లామని, అక్కడ ఏం జరిగినా వారిదే బాధ్యత అని చెబుతున్నారని నిర్వాహకులు వాపోతున్నారు. లారీలు ఆలస్యంగా రావడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని, ఇందుకు ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుంటేనే రైతులకు డబ్బు చెల్లింపు జరుగుతుంది. లేకపోతే లేదు. దీంతో రైతులలోనూ ఆందోళన నెలకింది. జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకుని దీనికి ఏదో ఒక పరిష్కారం చూపాలని పలువురు కోరుతున్నారు.
‘తడిసి’ మోపెడు
Published Sun, May 11 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM
Advertisement