ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : చెడగొట్టు వానతో చేతికొచ్చిన పంట చేజారింది. అకాల వర్షాలు రైతన్నకు గుండెకోత మిగిల్చాయి. జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు అన్నదాతను నిలువునా ముంచాయి. రైతులకు సుమారు రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఆకాశంలో ఇప్పటికీ మబ్బులు ఆవరించి ఉండడంతో కర్షకునికి కంటిమీద కునుకు లేకుండా పోయింది. గురువారం రాత్రి కురిసిన వర్షానికి జిల్లా వ్యాప్తం గా సుమారు 3 వేల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. కొనుగోలు కేంద్రాల్లోని 5 వేల క్వింటాళ్లకు పైగా వరి ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడం, ధాన్యం రవాణాలో నిర్లక్ష్యం వెరసీ రైతులు శాపంగా మారింది. జిల్లా వ్యాప్తంగా గురువారం 14.9 మి.మీ. వర్షపాతం నమోదైంది. జన్నారంలో 70 మి.మీ., ఆసిఫాబాద్‌లో 44 మి. మీ., ఖానాపూర్‌లో 43 మి.మీ., కడెంలో 38 మి.మీ., సిర్పూర్-యులో 46 మి.మీ. వర్షపాతం కురిసింది.
నేలకొరిగిన పైరు.. తడిసిన ధాన్యం..
దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్, మేదరిపేట్, నాగసముద్రం, చింతపెల్లిలో 19 ఐకేపీ, సహకార కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు తీసుకొచ్చారు. తూకం వేసినవి, విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలపై కప్పేందుకు సరిపడా టార్పాలిన్‌లు లేకపోవడంతో బస్తాలు తడిసిపోయాయి. దీనికితోడు కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడంలో జాప్యం కారణంగా బస్తాలు కేంద్రాల్లోనే నిల్వ ఉంచడంతో తడిసి ముద్దయ్యాయి. సుమారు 10 వేల బస్తాలు వర్షం కారణంతో తడిశాయి. 4 వేల క్వింటాళ్లకు పైగా ధాన్యానికి నష్టం చేకూరింది.
జన్నారం మండలం ఇందన్‌పల్లి, కమన్‌పల్లి, రేణుగూడ, తపాలాపూర్‌లో విక్రయించేందుకు తీసుకొచ్చిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా ఉంచగా, వర్షం నీరు మడుగులుగా వచ్చి ధాన్యం కిందికి రావడంతో ధాన్యం తడిసింది. కొత్తూర్‌పల్లి, రేళ్లగూడ, కవ్వాల్, బాదన్‌పల్లిలో 50 ఎకరాల వరి పంట నేలకొరిగింది.
లక్సెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్, హన్మంత్‌పల్లి, చందారం, వెంకట్రావ్‌పేటలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు, కుప్పలు వర్షం కారణంగా తడిసిపోయాయి. టార్పాలిన్‌లు సరిపడా లేకపోవడం, ఇక్కడ కూడా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపించలేదు. దీంతో వంద బస్తాల ధాన్యం, పలు ధాన్యం కుప్పలు వర్షానికి తడిసిపోయాయి.
మంచిర్యాల మండలం ముల్కల, కర్నమామిడి, పర్దాన్‌పల్లిలో అకాల వర్షం కారణంగా 2వేల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. చెన్నూర్, కోటపల్లిలో వందల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. చెన్నూర్ మండలంలోని పొక్కూరు, హస్నాద్, కొమ్మెర గ్రామాల్లో కొనుగోల కేంద్రాల్లో టార్పాలిన్‌లు లేకపోవడంతో 20 క్వింటాళ్ల వరి ధాన్యం తడిసిపోయింది. చెన్నూర్ మండలం అంగరాజ్‌పల్లి, కిష్టంపేట, కమ్మర్‌పల్లిలో మామిడి నేల రాలింది.
ఖానాపూర్‌లో వందల ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. మార్కెట్ యార్డులో కుప్పలుగా పోసిన ధాన్యం తడిసిపోయింది. నీళ్ల మడుగులు రావడంతో నష్టం చేకూరింది. దహెగాం మండలంలో 300 ఎకరాల్లో వరిపైరు నేలకొరిగింది. మొక్కజొన్న 30 ఎకరాలు, మిరప 30 ఎకరాల నష్టం చేకూరింది. నిర్మల్, దిలావర్‌పూర్, మామడ, సారంగాపూర్, కుంటాల మండలాల్లో అకాల వర్షాల కారణంగా పసుపు, వరి, మొక్కజొన్న పంట దెబ్బతిన్నాయి. ఇంద్రవెల్లిలో జొన్న పంట దెబ్బతింది.
వర్షార్పణం
Published Sat, May 10 2014 3:04 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement